పెద్దాపురంలో తాళపత్ర నిథి

పెద్దాపురం 2007లో లభ్యమైన తాళపత్ర గ్రంథం

బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ మహీధర సూర్యసూరి

అది 16 వ శతాబ్దం పెద్దాపురం సంస్థానాన్ని 1607 నుండి 1649 వరకూ పరిపాలించిన వత్సవాయ రాయజగపతి మహారాజు గారి పరిపాలనా కాలం…రాయ జగపతి తండ్రి గారైన చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు గారు పెద్దాపురం ఊలపల్లి, బిక్కవోలు, వాలుతిమ్మాపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో చెరువులు త్రవించి పండ్ల తోటలు వేయించి అభివృద్ధి చేశారు

సీ. బిరుదాంకపురిని సుస్థిరముగా నిర్మించె
బాలమున్నీటిని బోలు చెరువు
తిరుపతివల్మీక గిరినూలపల్లిని
పలవృక్షవనముల నిలిపె జాల
నృహరిగేహతటాక నిక్షేపవనములు
గొమరుగా బెద్దాపురమున నుంచె
విశ్వనాథకవీంద్రవిరచిత శేషధ
ర్మప్రబంధము సాదరముగ నందె

తే.గీ. విశ్వవంశప్రతిష్ఠలు వెలయజేసె
బుత్రులనుగాంచె నీతిని బుడమియేలె
వత్సవాయాన్వయమునకు వన్నెదెచ్చె
హెచ్చె బేరయతిమ్మ ధాత్రీశ్వరుండు

పెద్దాపురం సంస్థానంలోని ఊలపల్లి గ్రామస్థులైన సద్బ్రాహ్మణోత్తములు శ్రీ మహీధర సూర్యసూరి గారు పరమ రామభక్తులు కావడమే కాకుండా శ్రీ రామ చంద్రులవారి గుణగణాలను కీర్తిస్తూ శ్రీ రామస్తవ రత్నాకరమ్ పేరిట 115 శ్లోకాలను తాళపత్ర గ్రంథం పైన లిఖించారు…

రాయజగపతి మహారాజు గారు కూడా గొప్ప రామభక్తులు…

శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు,
గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ
బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను ఫలభూజవాటికల్ పదిలపరచే”

అని తన రామవిలాసం లో ఏనుగు లక్ష్మణ కవి గారు వర్ణించారు

ఆనోటా ఈ నోట మహారాజు గారు మహీధర సూర్యసూరి గారి పేరు మరియు రాములవారిపై ఆయన రచించిన రామస్తవ రత్నాకరమ్ శతకం గురించి విన్నారు… ఆ శతకంలోని శ్లోకాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సమీక్ష చేయవలసినదిగా తన ఆస్థానపండితులను రాజావారు ఆదేశించారు

మహారాజు గారి ఆదేశానుసారం పండితోత్తములందరూ పరిశోధనలో నిమగ్నమయ్యారు… సంస్కృత ఛందస్సులో శ్లోకాల యొక్క రచనా ప్రక్రియలోనే అప్పటి వరకూ ఎవరూ ప్రయోగించని… ఆ తరువాత ఎవరూ ప్రయోగించలేని అష్టప్రాసాయతి నియమాన్ని మొట్టమొదటి సారిగా ప్రయోగించి రామస్తవ రత్నాకరాన్ని రమ్యంగా రచించిన తీరు సంస్థానంలో సాహితీ ఉద్ధండులను సైతం ఆశ్చర్యచకితులను చేసింది… రాజావారి ఆస్థాన పండితులు రామస్తవ రత్నాకరాన్ని ఆద్యంతం పరిశీలించి… సమీక్షించి సూర్యసూరి వారి పాండిత్యం ప్రతిభ అనన్య సామాన్యమనీ… శ్రీ సూర్య సూరి గారు మహారాజుగారి సత్కారానికి అన్నివిధాలా అర్హుడని రాజావారికి తెలియజేసారు మహారాజు గారు సూర్య సూరి గారి ఘన సత్కారానికి ఏర్పాటు చేయమని వారి స్వగ్రామం లోనే వారికి 20 పుట్ల భూమి (పుట్టి అనగా 8 ఎకరాలు కనుక సుమారు 160 ఎకరాలు) సత్కారం అనంతరం బహుమానంగా ఇవ్వనున్నామని వర్తమానం పంపించారు…

రాజాస్థాన ఉద్యోగులు పండిత లాంఛనాలతో ఊలపల్లి గ్రామం చేరుకున్నారు సూర్య సూరి గారింటింకి వీచ్చేసి రాజువారి ఆనతి తెలియజేసారు… స్వాభిమానధనులైన శ్రీ సూర్య సూరిగారు బదులిస్తూ తాను సత్కారాల కోసమో బహుమానాలకోసమో రామస్తవ రత్నాకరమ్ వ్రాయలేదనీ…. తనకు తన పూర్వీకులు, తలిదండ్రులు, పూజ్య గురుదేవులు ప్రసాదించిన పాండిత్యం, శ్రీరామచంద్రులవారిమీద ఉన్న ఎనలేని భక్తి పారవశ్యం, రామచంద్రులవారి కరుణా కటాక్షాలే ఈ రచనకు మూలం తప్ప మరేదీ కాదని అందుచేత బహుమతిని స్వీకరించలేనన్న విజ్ఞప్తిని మహారాజుగారికి తన మనవిగా తెలియజేయమని కానుకను సునిశితంగా తిరస్కరించారు…

ఆ తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న మహీధర సూర్యసూరివారి సతీమణి శ్రీమతి లక్ష్మాంబ గారు మహారాజుగారికి ఒక విజ్ఞప్తిని పంపించారు తన భర్త పండిత సహజమైన స్వాభిమానంతో సత్కారాన్ని సునిశితంగా తిరస్కరించారని వాస్తవానికి వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితికి రాజావారు అనుగ్రహించిన భూమి అత్యంతావశ్యకమనీ వారి సతీమణిగా సత్కారానికి తానూ అర్హురాలేనని పెద్దాపురాధీశులు భావిస్తే ఆ బహుమానంగా ఇవ్వదలచుకున్న భూమిని తనకే ఇప్పించగలరని అభ్యర్ధన పంపారు…

మహారాజుగారు దానికి సానుకూలంగా స్పందించి లక్ష్మాంబ గారి సమయస్ఫూర్తిని అభినందించి… సూర్యసూరి లక్ష్మాంబ దంపతులకే కాక మహీధర వంశస్థుల పుత్రపౌత్ర్యాదులు మరియు వారి సంతతి మొత్తం అనుభవించేందుకు వీలుగా వారి స్వగ్రామం అయిన ఊలపల్లిలోనే 20పుట్ల భూమిని బహుమానంగా అందించారు

మహీధర సూర్యసూరి గారు రచించిన 115 శ్లోకాల తాళపత్ర గ్రంథం తరతరాలుగా చేతులు మారుతూ నేమాని వారికి చేరాయి నేమాని సత్యనారాయణ శాస్త్రి గారు రామస్తవ రత్నాకరమ్ లోని అన్ని సంస్కృత పద్యాలనూ తెలుగులోకి అనువదించి ఆయన వద్ద బద్రపరుచుకున్నారు 2007వ సంవత్సరంలో పెద్దాపురంలో నేమాని సత్యనారాయణ శాస్త్రి గారి ఇంటి వద్ద తాళపత్ర గ్రంథం ఉన్న సమాచారం ఒక విలేఖరు ద్వారా తెలుసుకున్న పురావస్తు శాఖవారు వాటిని అప్పగించమని కోరారు… నేమాని సత్యనారాయణ శాస్త్రి గారు దానికి బదులిస్తూ ఈ తాళపత్ర గంథానికి అసలు వారసులైన మహీధర సూర్య సూరి 6వతరం వారసులు శ్రీ మహీధర రామశాస్త్రి వారు రాజమహేంద్రవరం లో ఉన్నారని వారికి అప్పగించడం న్యాయమని నిర్ణయించి వారికి అప్పగించారు… గత దశాబ్ధకాలంగా రామస్తవ రత్నాకరమ్ రామశాస్త్రి గారి పూజామందిరంలో పూజలందుకొంటూంది

రచన సేకరణ @వంగలపూడి శివకృష్ణ

2682total visits,13visits today

3 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *