పెద్దాపురంలో వేములవాడ భీమకవి

వేములవాడ భీమకవితో వత్సవాయ తెలుంగరాయడు

పెద్దాపురాన్ని పాలించే తెలుంగరాయుడు అనే మహారాజుకి ఎప్పటి నుంచో వేములవాడ భీమకవిని తన పెద్దాపురం రాజ్యానికి పిలిపించుకోవాలని ఎంతో ఆశ ఉండేది. ఉద్దండకవి, మహానుభావుడు అయిన భీమకవి తన రాజ్యమున ఉంటే ఎల్లప్పుడూ విజయైశ్వర్యములతో తన రాజ్యము తులతూగుతుందని భావించేవాడు.  ఇదిలా ఉండగా ఒకసారి వేములవాడ భీమకవి గారే స్వయంగా తెలుంగరాయుడు పాలిస్తున్న పెద్దాపురం సంస్థానానికి వెళ్లారు

     ఇలాంటి అవకాశము కోసమే ఎదురుచూస్తున్న తెలుంగరాయుడు భీమకవీశ్వరుడే స్వయంగా తన ఆస్థానానికి రావడంతో పట్టలేని ఆనందంతో వెంటనే చందనం, కస్తూరి, జవ్వ, పునుగు, పచ్చకర్పూరం మొదలగు సుగంధ వస్తువులను బహుమతిగా ఇచ్చి అత్యంతభక్తితో భీమకవిని పూజించాడు. తన ఆస్థానంలో కొన్ని రోజులు ఉండి తమ ఆతిధ్యం స్వీకరించవలసినదిగా అభ్యర్ధించాడు భీమ కవి సరేనని పెద్దాపురం ఆస్థానంలో తెలుంగరాయడి ఆతిథ్యంలో ఉంటాడు… తెలుంగరాయడికి వేట అంటే ఎంతో ఇష్టం. ఓ సారి వేటకు వెళుతూ తన వేటను వీక్షించడానికి భీమకవిని తనతో రమ్మని కోరాడు. భీమకవి రాజు మనవి కాదనకుండా, వెళ్ళడానికి సిద్ధమయ్యారు. తనతో పాటి ఇంకొందరు భటులను కూడా తీసుకొని బయలుదేరారు. భీమకవి, తెలుంగరాయడు తమతమ గుర్రాలపై ప్రక్క ప్రక్కనే వెళ్ళసాగారు. సాయంత్రమయ్యే సరికి వారు పులులు సింహాలు అడవిపందుల తోడేళ్లు ఇతర క్రూర మృగాలతో నిండి మిక్కిలి ప్రమాదకరమైన దట్టమైన అడవిని సమీపించారు…. మనుషుల సవ్వడి వింటే మృగాలు ఎక్కడ పారిపోతాయోనని తనతో వచ్చిన భటులనందరినీ అన్ని దిక్కులకు చెదిరిపొమ్మని ఆదేశించాడు. భీమకవిని మాత్రం తనతో ఉండమని కోరగా, ఇరువురూ ఒకే చోట ఉంటూ ముందుకు కదిలారు. తెలుంగరాయుడికి పొదల్లోకి పారిపోతూ ఒక వరాహము కనపడింది. ఆ వరాహాన్ని చూడగానే భీమకవితో ఎలాగయినా ఈ వరాహాన్ని పట్టాలి అని చెబుతూ చప్పుడు చేయకుండా వెనుక నుండి దానివైపుకు అడుగులేయబోయాడు.

భీమకవి – తెలుంగరాయడిన్ని ఆపి “వరాహమును మాటు నుండి కొట్టడం పౌరుషలక్షణము కాదు. వరాహమునకు ఎదురేగి ప్రతిభను ప్రదర్శించి పట్టుకున్నవాడే ప్రజ్ఞావంతుడు. అలా చేయగలవా? లేదా నన్ను చేసి చూపమంటావా?” అని అడిగారు.

తెలుంగరాయడు “కవీశ్వరా! మీకు కవిత్వంలోనే కాక వేటలో కూడా ఉద్దండ సామర్థ్యమున్నవాడిలా మాట్లాడుతున్నారే. మీకా సామర్థ్యముంటే చేయ”మని అడిగాడు. భీమకవి “తెలుంగాదీశా! నా శక్తి సామర్థ్యాలు నీ ఊహల కందనివి. నేను వాక్పరాక్రమమున్న మహాకవిని కావున నా నోటి మాట (ఒక పద్యము) చాలు ఆ వరాహమును ఆపి తీసుకురావడానికి. మేము అలా బంధించి తీసుకువచ్చి ఆ వరాహమును మీ ముందు వదులుతాము. మీరు మీ పరాక్రమమును చూపి, బాణములను వదిలి, ఆ వరాహమును పట్టుకొని భుజ బలపరాక్రమ శాలివగు రాజువని నిరూపించుకొమ్మని” చెప్పి ఈ క్రింది పద్యాన్ని చెప్పారు.

|చ| కడక ధనంజయుండు మును ఖాండవమున్ దహించు వేళ నే
       ర్పడ శరజాల నిద్ధమయి వర్షములొఁ జొఱ జాలనట్టులీ
       యడవిన సందుగాన కిట నాగు వరాహమ! నాదు వాక్కునఁ
       బొడువదు ప్రొద్దుకూడ నిను భూపతి కర్పణ సేతునియ్యెడన్

భావము: ఈ అడవిన పొదలందు దాగబోయిన ఓ వరాహమా! పూర్వము ఖాండవవనము అగ్నికి ఆహుతి అవుతున్న వేళ అర్జునుడు సంధించిన బాణాలచే ఆపబడి, కరిగి వర్షించిన మేఘములాగా, నీవు నా మాటవిని ఆగిపో! నా మాటకు పొడిచే పొద్దు కూడా పొడువదు. ఈ వేళ నిను మహారాజుకు బహుమతి చేయబోతున్నాను.
వెంటనే ఆ వరాహము ఎక్కడకు పోకుండా పరుగులు మాని ఆగిపోయింది. భీమకవి ఆ వరాహమును తీసుకువచ్చి తెలుంగరాయుడి ఎదుట వదిలివేసి, ఇక మీ నైపుణ్యంతో పట్టమన్నారు. తెలుంగరాయుడు కూడా తాను నేర్చిన విద్యనుపయోగించి తన శరపరంపరతో వరాహమును నలుదిక్కులా కదలనీయకుండా.. ప్రాణం తీయకుండా… సజీవంగా బంధించి పట్టుకొని భీమకవి వద్దకు తీసుకొచ్చి చూపించాడు.

భీమకవి అతని పరాక్రమమునకు సంతసించి “నువ్వు భూవరేణ్యుడవు. నేను కవివరేణ్యుడను. మన మైత్రి ఎప్పటికీ చెదిరిపోదు. ఇక వేటాడ్డం చాలు ఇంటికి వెళ్దాం పదా. వేట నెపంతో వన్యప్రాణులను చంపకూడదు. అందులోనూ వరాహము విష్ణువు అవతారము. రాజులకు వేట ధర్మమే అయినా అది వన్యమృగాలు ఎక్కువయ్యి అడవులను వదిలి పంటచేలను నాశనము చేయునపుడు, జనవాసానికి ఆటంకం కల్గించినపుడు వాటి సంఖ్యను తగ్గించడం కోసం వేటాడ్డం క్షత్రియధర్మము. నిష్కారణముగా వన్యప్రాణులను బంధించి చంపుట అధర్మము. స్వేచ్ఛగా విహరించు ఈ వరాహమును బంధించి దాని స్వేచ్ఛకు ఆటంకమును కల్గించాము. దానిని వెంటనే విడిచి పెట్టు. ఈ కళంకము అంటకుండా వరాహ పురాణమును రచించి నీకు అంకితము చేస్తాను. ఆ వరాహ పురాణానికే నృసింహపురాణమని నామకరణము చేస్తాను” అని చెప్పారు. ఆ రాజు కూడా వరాహమును వదిలిపెట్టి ఆనాటి నుండి వినోదం కోసము జంతువేటాను మానేసాడు. ఆ తరువాత భీమకవి నృసింహపురాణము పేరిట వరాహ పురాణమును రచించి తెలుంగరాయునికి అంకితమిచ్చారు. భీమకవికి నృసింహపురాణము రచించుటకు ఎక్కువ కాలము పట్టలేదు కాని, ఆ నృసింహపురాణమును తెలుంగరాయునికి చదివి వినిపించుటకు ఒక సంవత్సరానికి తక్కువ సమయం పట్టలేదు. ఇందుకు కారణం భీమకవిపై, ఆయన కవిత్వముపై తెలుంగరాయుడికి ఉన్న ఆభిమానం మక్కువ అలాంటిది. భీమకవి ఒక్కొక్క పద్యానికి మిక్కిలి విశ్లేషణాత్మకంగా భావాన్ని వివరించగా, రాజు కూడా ప్రతి పద్యాన్ని పదేపదే చదివి ఆనందపడ్డాడు. అలా వరాహావతారమైన విష్ణుమూర్తి చరితమైన ఆ కావ్యమును విని తరించాడు.

వరాహమును బంధించిన కళంకం అంటకుండా, తాము బంధించిన వరాహము పరిస్థితిని చందమామతో పోలుస్తూ నృసింహపురాణములో క్రింది పద్యముతో వివరించారు.

|చ| సురచిరపానపాత్రమున సుందరియొక్క తే కేలనిండు చం
       దురుడు ప్రకంపి తాంగములతోఁ దిలకించెఁ దదానంబుజ
       స్ఫురిత వికాస వైభవము సొంపులడంకువ మ్రుచ్చిలింపఁ జె
       చ్చెరఁ జనుదెంచి కట్టువడి చేడ్పడి భీతివడంకు చాడ్పునన్

భావము: ఆ సుందరి చేతిలో ఉన్న మిక్కిలి రమణీయమైన పానపాత్రము (లోటా లేదా పాత్ర)లో చంద్రుడు అత్యంతగా ప్రకాశిస్తున్నాడు. చంద్రుని అందాలన్నీయూ ఆ సుందరి ముఖవైఖరులచే దొంగలింపబడినట్లుగా ఆమె చేతిలో (ఉన్న పాత్రలో) కట్టుబడపొయి భయముతో వణుకుతూ ఉన్నట్లుండెను.
ఈ పద్యము చదివిన తెలుంగరాయుడు “ భళిరే! మహాత్మా! మీ కవితా వైచిత్యము వలన చంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు కూడా కట్టుబడిపోతారు. కొద్ది పదార్థమును గొప్పదిగాను, గొప్ప పదార్థమును కొద్దిగాను చేసే శక్తి మీవంటి కవీశ్వరునికి గాక ఇంకెవరికి సాధ్యమవుతుంది? మహా తపస్సు చేసి అష్టసిద్ధులు పొందిన సంయమీంద్రులు కూడా భీమకవీంద్రునికి సాటి రాగలరా? “ అని మిక్కిలి ప్రశంసించగా భీమకవి అష్టసిద్ధులు అంటే ఏమిటో రాజుకు ఈ క్రింది శ్లోకమును చెప్పారు.

“అధిమా మహిమా చైవ గరిమా లఘిమా తధా
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వంపశత్వం చాష్ట సిద్ధియః”

Ref :  వేములవాడ భీమకవి విరచిత వరాహ పురాణం / వేములవాడ భీమలింగేశ్వరస్వామి జీవిత చరిత్ర

 

1593total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *