పెద్దాపురాధీశుడు పిసినారి మహారాజా !!!

“ఇవ్వడు ఇవ్వడంచు జను లెప్పుడు తప్పక చెప్పుచుందు రే

………… డివ్వడు! తిమ్మజగత్పతీంద్రుడే.”

 

పెద్దాపురం సంస్థానాధీశులు చేతికి వెన్నుముక లేనివారుగా చుట్టుపక్కల అన్ని రాజ్యాలకూ సుపరిచితులయ్యారు వారి కీర్తి విశ్వవ్యాప్తమయ్యింది దేశ దేశాలనుండి కవులు, కళాకారులు, పండితులు, బ్రాహ్మణోత్తములే కాదు, ఇరుగు పొరుగు సంస్థానాల రాజులు, సామంత మండలాధీశులు సైతం పెద్దాపురాధీశుల వద్ద దానం పొందుతుండేవారు… పిఠాపురాధీశులు పసుపుకుంకుమ మాన్యంగా సామర్లకోట వద్ద గల కుమారారామ భీమవరం… యుద్ధ వేళలలో అవసరమైనపుడు సైన్యం పొందినట్టు చారిత్రకాధారాలున్నాయి ఒక్క పిఠాపురాధీశులే కాక నూజివీడు, విజయనగరం సంస్థానాధీశులు సైతం అనేకమార్లు పెద్దాపురం సంస్థానాధీశుల సహాయం పొందినవారే…

రాజుగారి నోటివెంట లేదు అనేమాట ఎప్పటికీ రాదు…. అయితే పెద్దాపురాధీశుల అతి దానగుణం వల్ల సంస్థానం అనేక మార్లు ఇబ్బందులకు కూడా గురి అయ్యేది… ఈ విషయాన్ని గమనించే రాజ్యంలోని ఠాణే దారులు దివానులు సామాన్యులకు మరియు దానం ఆశించి రాజ్య ప్రవేశం చేసే వారికి… రాజుగారి దర్శనభాగ్యం కలగకుండా అడ్డుపడేవారు అంతేకాదు…. తప్పని పరిస్థితులలో రాజుగారు పరమ లోభి అని అతను పిల్లికి బిచ్చం వేయని పీనాసి అని కూడా వచ్చిన వారికి చెప్పేవారు…

ఎప్పటి లాగే ఒక నాడు తూర్పు దేశం నుండి ఒక కవి మహా రాజు గారి దర్శనం కోసం పెద్దాపురం సంస్థానానికి వచ్చాడు మహా రాజు గారికి తన పరిస్థితి చెప్పి  దానం అడగడం అతని ప్రధాన ఉద్దేశ్యం… రాజ్యంలోని ప్రజలకు తానొచ్చిన విషయం చెప్పి కోటకి దారెటు అని అడుగగా గ్రామస్తులంతా మహారాజు పిసినారి అని అతను ఎవరికీ ఏమీ ఇవ్వడని చెప్పారు… అయినప్పటికీ ఆశచావక రాజు గారి దర్శనం ఇప్పించమని అడగటానికి దివాను గారి ఇల్లు చిరునామా తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు… తాను కటిక దారిద్ర్యంలో ఉన్నానని రాజుగారి అనుగ్రహం కోరి వచ్చానని దివాను గారికి వివరించాడు… దివాను పుల్ల విరుపు మాటలతో ఆ కవిని భలే వాడివయ్యా నువ్వు తూర్పు దేశంనుండి పీనాసి రాజుగారి అనుగ్రహం కోరి వచ్చావా… బలే బలే… తిమ్మరాజు ఏమీ ఇవ్వడయ్యా అనవసర ప్రయాస మాని వచ్చిన దారిన వెళ్ళిపో అంటూ హితవు పలికాడు…

చేసేది ఏమీలేక కవి వెనుదిరిగాడు… వెళ్లే దారిలో ఒక దుకాణం వద్ద రాజా దర్బారు నేడు జరుగుతుందని విని అటు వైపు అడుగేసాడు… ఎట్టకేలకు అతి కష్టం మీద దర్బారు వద్ద ప్రజా సమూహం లో ఒకడిగా నిల్చున్నాడు… కొంత సమయం గడిచాకా రాజు గారి దృష్టిలో పడాలని అటు ఇటూ కదులుతూ గాలిలో చేతులు ఊపుతున్నాడు అది గమనించిన దివానుకి ముందు నోట మాట రాలేదు, తరువాత కోపం వచ్చింది… అంతలోనే సమయస్ఫూర్తి గుర్తుకి వచ్చి మహారాజు గారితో మహా రాజు గారికి జరిగిన విషయం చెప్పి దానం చేసే ముందు కవిని పరీక్షించండి అని మనవి చేశారు రాజు గారు కవి గారిని ప్రవేశ పెట్టమని ఆదేశించారు

కవిగారు మహారాజు గారికి తమను తాము పరిచయం చేసుకున్న తరువాత తన పాండిత్యం తన ప్రస్తుత పరిస్థితి వివరించారు… వెంటనే మహారాజు గారు కలుగ జేసుకొని పెద్దాపురాధీశుడు ఎవరికీ ఏమీ ఇవ్వడు ఈ విషయాన్ని జనం మీకు చెప్పలేదా… రాజ్యంలో ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేదా అని ప్రశ్నించారు కవి వెంటనే దానికి బదులిస్తూ

ఇవ్వడు ఇవ్వడంచు జను లెప్పుడు తప్పక చెప్పుచుందు రే
మివ్వడు ? అన్య కాంత కుర మివ్వడు! సంగర రంగ మందు వె
న్నివ్వడు! శత్రులన్ ప్రబల నివ్వడు! బెబ్బులి నైన పట్టి పో
నివ్వ! డసత్య వాక్య మెపు డివ్వడు! తిమ్మజగత్పతీంద్రుడే.

చూసారా కవి ఎంత తెలివైన వాడో… సత్కవులు ఎంత సమయస్ఫూర్తి గలవారో పెద్దాపురాధీశుడి మాటకి ఎదురు చెప్పకుండా పెద్దాపురం ప్రజలను దివానుని, మహారాజు గారిని ఎక్కడా తక్కువ చేయకుండా ఒక అద్భుతమైన పద్యం చెప్పి సభికులందరి చేతా వారెవ్వా అని పించాడు పై పద్యం అర్ధం ఒక్కసారి చూడండి

మహా రాజా పెద్దాపురాధీశుడైన తిమ్మగజపతి మహారాజు ఎవరికీ ఏమీ ఇవ్వడు ఇవ్వడు అంటారు అది వాస్తవమే అయితే ఆయన ఏమివ్వడో చూడండి.
పరస్త్రీకి మనసివ్వడు… యద్ధములో వెన్నివ్వడు (వెనకడుగు వేయడు)… శత్రువులను ప్రబలనివ్వడు (ఎక్కువ కానివ్వడు)… బెబ్బలినైన పట్టి పోనివ్వడు…. అసత్యవాక్యన్ని ఎప్పుడూ ఇవ్వడు. అంటూ పదే పదే
ఇవ్వడు ఇవ్వడు అంటూ పద్యం అల్లుతూ మహారాజు గారి గుణగణాలను వర్ణించిన విధానం అనన్య సామాన్యం అందుకే మహారాజు ఎవ్వరికీ ఇప్పటివరకూ ఎవరికీ ఇవ్వనంత పారితోషకం ఆ కవివరేణ్యుడికి ఇచ్చి పంపించాడు

రచన / సేకరణ : వంగలపూడి శివకృష్ణ – తీయని తెలుగు పద్యం అనే పుస్తకం నుండి గ్రహించబడినది

13216total visits,17visits today

5 Comments

Leave a Reply to Krishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *