ALLURI SEETHA RAMA RAJU – PEDDAPURAM HISTORY

పెద్దాపురం తో అల్లూరి సీతారామరాజు అనుబంధం

అల్లూరి సీతారామరాజు పోరాటంలో పెద్దాపురం పాత్ర

అల్లూరి సీతారామ రాజు నడయాడింది ఇచ్చట
మన్యానికి సింహమై తీర్చెను ఆ తెల్లదొరల తీట

మన్నెం పోరాట యోధుడు…
బ్రిటీషువారికి ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు గారికి పెద్దాపురం డివిజన్ తో ఉన్న అనుబంధం

పెద్దాపురం రెవిన్యూ డివిజన్ పరిధిలోనే ఆనాటి మన్నెం అటవీ ప్రాంతంఉండేది

మన పెద్దాపురం ఆడపడుచు మద్దూరి రమణమ్మ గారి భర్త మద్దూరి అన్నపూర్ణయ్య గారూ మరియు అల్లూరి సీతారామరాజు గారు బాల్యమిత్రులు… ఇద్దరూ కలిసి పిఠాపురం మహారాజా కళాశాలలో చదువుకున్నారు

పెద్దాపురం మహారాజాస్థాన కవి వత్సవాయి వంశస్థుడు శ్రీ వత్సవాయి వెంకట నీలాద్రిరాజు గారి వద్ద అల్లూరి సీతారామ రాజు గారు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నారు

#అల్లూరి_దాడులు_పరిణామాలలో_పెద్దాపురం
అప్పటి పెద్దాపురం డివిజన్ పరిధిలో ఉన్న రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 1922 ఆగష్టు 22న దాడి చేసారు, 24 న రాజవొమ్మంగి స్టేషన్ పై దాడి చేశారు, ఇలా చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, స్టేషన్ ల పై వరుస దాడులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు .. అయితే అసలు మన్నెం లో ఏం జరిగిందో వాస్తవం ఎవరికీ తెలియకుండానే ఏవేవో పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పెద్దాపురం కాంగ్రెస్‌ నాయకులు వార్తాపత్రిక లకు మన్యంలో ఎదో జరిగిందని సమాచారం ఇచ్చారు… అలాగే రాజమండ్రి కేంద్రంగా వెలువడుతున్న మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడుగా వ్యవహరిస్తున్న “కాంగ్రెస్” మాస పత్రికకు, అలానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సమాచారమిచ్చి వెంటనే సమస్యను మన్నెం ప్రాంతాన్ని పర్యవేక్షించవలసినదిగా కోరారు

ఈ పరిస్థితిని అతి దగ్గరగా గమనించిన ఒక పెద్దాపురం విలేఖరీ “మన్యం పితూరీ – మూడు పోలీసు స్టేషన్ లు చోరీ – పట్ట పగలే చోరీ చేయుట” అంటూ 28 ఆగస్టు 1922 న మొట్టమొదటి తెలుగు వార్తా పత్రిక – ఆంధ్ర ప్రత్రికలో ఒక సంచలనమైన వార్త రాయడంతో రాష్ట్రమంతా విషయం వ్యాప్తి చెంది…. ఈ దాడుల నేపథ్యం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది ఆ తరువాత మరలా పెద్దాపురానికి చెందిన ఆ విలేఖరే 1922 ఆగస్టు 31 న పత్రికలో అల్లూరి సీతారామరాజు పేరుతో అల్లూరి అతీంద్రియ శక్తులు కలవాడని అతన్ని తూటాలు కూడా గాయపరచలేవు అని అక్కడి ప్రజల నమ్మకం అనీ అయితే దాడి చేసే ముందు సమాచారం ఇచ్చి మరీ దాడి చేస్తాడని వార్త ప్రచురించడం అలాగే హితకారిణీ, న్యాయ దీపిక, ఆర్య ప్రభ, స్వరాజ్యం, గోదావరి పత్రిక లాంటి పలు పత్రికలలో వచ్చినా కథనాలతో అల్లూరి పేరు ఆంధ్ర రాష్ట్రమంతటా మారుమోగి పోయింది బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ముందస్తు హెచ్చరిక చేసి మరీ దాడిచేసి విజయం సాధిస్తున్న అల్లూరి సాహసం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించి అతని పై ఆరాధనా భావాన్ని పెంచింది… ఒకవైపు బ్రిటీషు ప్రభుత్వానికి మరో వైపు కాంగ్రెస్ వారికి ఇది మింగుడు పడని అంశంగా మారింది –

పోలీస్‌ సూపరింటెండెంట్‌ సాండర్స్‌ నాయకత్వంలోని బలగాలు డాసన్‌, కీనే, ట్రేమన్‌హేర్‌, స్కాట్‌ కవర్డ్‌ నాయకత్వాలలోని బలగాలు మన్నెం ఏజెన్సీ అటవీ ప్రాంతం మొత్తాన్ని మోహరించారు

పెద్దాపురం కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నాయకులకి వ్రాసిన టెలీగ్రామ్ పై అప్పటి ఆంద్ర రాష్ట్ర కాగ్రెస్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు సమాధానమిస్తూ … పెద్దాపురం కాంగ్రెస్ నాయకులను మందలిస్తూ 30 ఆగష్టు 1922 తేదీ తో ఒక టెలిగ్రాం రాశారు ఆ టెలీగ్రామ్ ను బ్రహ్మజోస్యుల సీతారామయ్య అనే కాంగ్రెస్‌ కార్యకర్త 04 సెప్టెంబరు 1922 న పెద్దాపురం తీసుకు వచ్చారు

#ఆ_టెలీగ్రామ్ సారాంశం ఏమిటి అనగా ?
“అల్లూరి సీతా రామ రాజు అతని అనుచరులు దోపిడీ కారులు వారు దేశ భక్తులు కారు ఈ విషయంలో ‘‘పెద్దాపురం కాంగ్రెస్‌ వారు ఏమీ కల్పించుకొనకూడదు, దోపిడీగాండ్రు పోలీసు స్టేషన్లను దోచుకుని తుపాకులను, తూటాలను తీసుకుని పోతుంటే కాంగ్రెస్‌ వారు చేయవలసిందేమిటో నాకేమీ బోధపడడం లేదు. వారి దగ్గరకు పోయి మీరిట్లా చేయరాదని నెమ్మదిగా బోధించడానికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్‌ వారు ఎవరూ కూడా బందిపోట్ల దగ్గరకు పోకూడదు. కాంగ్రెస్‌ నాయకులు రావాలని పెద్దాపురం కాంగ్రెస్ వారు పత్రికలకు తంతి వార్తలు పంపడమే అసంగతం.’’ అంటూ లేఖ రాశారు…

ఆ తరువాత జరిగిన అల్లూరి పోరాటం అతని వీరమరణం అందరికీ తెల్సిందే

ఇలా విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు గారి పోరాటంలో ఘట్టాలు కొన్ని పెద్దాపురంతో ముడి పడి ఉన్నాయి రామ సేతు నిర్మాణంలో ఉడుత పాత్రలా రామరాజు పోరాటంలో పెద్దాపురం పాత్ర కూడా స్మరణీయం @వంగలపూడి శివకృష్ణ

566total visits,8visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *