Gollala Mamidada Temple History

గొల్లల మామిడాడ కోదండ రామాలయం

శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి అని పాట వినబడినా సీతారాముల కళ్యాణం అనే మాట వినబడినా మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే. అయితే అందరూ ఏటా ఆరోజున భద్రాద్రికి వెళ్లలేరు కాబట్టి, ఆ రాముణ్ణే తమ వాడకు తెచ్చి, తోచిన రీతిలో కల్యాణం జరిపించే ఆచారం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందులో భాగంగా వెలసినదే తూ.గో.జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడలోని రామాలయం.

గొల్లల మామిడాడ గాలి గోపురం
గొల్లల మామిడాడ గోపురాల మామిడాడ

గొల్లల మామిడాడ శ్రీకోదండ రాముని ఆలయం గణాంకాలు:
1889లో గ్రామానికి చెందిన ద్వారంపూడి సబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు ఓ చిన్న ఆలయాన్ని కట్టి, అందులో చెక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తరవాత 1939లో ఆలయాన్ని పునః నిర్మించారు. 1950లో తొమ్మిది అంతస్తులతో తూర్పువైపున గాలిగోపురం, తిరిగి 1958లో 200 అడుగుల ఎత్తులో 11 అంతస్థుల పశ్చిమగోపురాన్నీ నిర్మించారు. పెద్దాపురం వాస్తవ్యులు శిల్పాచార్య కీర్తి శేషులు శ్రీ బుడత సూర్యారావు గారు ఈ నిర్మాణానికి పనిచేసిన శిల్పకళాకారులందరికీ నేతృత్వం వహించారు. ఈ గోపురాలపై రామాయణ గాథను బొమ్మల రూపంలో మన బుడత సూర్యారావు గారు చక్కగా వివరించారు. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఈ గోపురాలమీద కేవలం రామాయణ ఘట్టాలేకాదు, మహాభారత, భాగవత దృశ్యాలనూ కళ్లకు కట్టినట్లుగా చెక్కడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయశిఖరం(విమానగోపురం)మీద బాల రామాయణ గాథను తెలిపే బొమ్మలు చెక్కారు. గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఎటువైపు నుంచి చూసినా ఈ గోపురాలు కనిపిస్తాయి. పశ్చిమగోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట, 20 కి.మీ. దూరంలోని కాకినాడ కనిపిస్తుంటాయి.

ఈ గోపురం నిర్మాణం కోసం శిల్పాచార్యులు ఎంత కృషి చేశారంటే ఆ గోపురాన్ని చూసిన ఎవ్వరైనా సరే అది 50 సంవత్సరాల క్రితం కట్టిన గోపురం అంటే ఎవ్వరు నమ్మరు అది అత్యంత పురాతన మైనది అని పూర్వకాలం మహా శిల్పులు కట్టింది అని కథలు కథలు గా చెప్పుకుంటుంటారు. ఒక్క సారి అది పెద్దాపురం వాసులు కట్టింది అని నిరూపించగానే అవాక్కయిపోయి శిల్పాచార్యులకి శిరశు వంచి నమస్కారం చేస్తారు.

అద్దాల మేడ
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ అద్దాలమేడ ఈ అద్దాల మేడ 1975 లో ఏర్పాటు చేశారు ఒక మనిషిని మరుగుజ్జుగా అత్యంత పొడవరిగా రక రకాలుగా చూపించడం ఈ అద్దాల మేడ ప్రత్యేకత
మొదటి అంతస్తులో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణవధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆంజనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన సీతారామ విగ్రహాలు, సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వార చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను, సీత రాములు సింహాసనములో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.శ్రీరామనవమి, రథసప్తమిల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు తిరునాళ్ళు జరుగుతాయి. భద్రాచలం తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.

ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా దేవుడికోసం ఓ అద్దాల మందిరాన్నీ నిర్మించడం ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత. పశ్చిమగోపురానికి ఆనుకుని 64 స్తంభాలతో పుష్పకమను పేరుతో కట్టిన మండపంమీద అలనాటి మయసభను తలపించేలా ఈ మందిరాన్ని నిర్మించారు. ఎటు వెళుతున్నామో తెలీదు. కానీ ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ని చూడగలగడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మండపం చుట్టూ ఉన్న గోడలమీద ఆకర్షణీయమైన శిల్పాల్లో రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. స్వామి కల్యాణం అనంతరం రాములవారి శ్రీపుష్పయాగాన్ని ఈ అద్దాలమందిరంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామ పుష్కరిణి!
ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. పవిత్ర తుల్యభాగ నదీజలాలు ఇందులో ఉండేలా చూస్తారు. శ్రీరామకల్యాణానికి పుష్కరిణి నీటినే తీర్ధబిందెలతో తీసుకొచ్చి, స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా శ్రీరాముడికి వసంతోత్సవం, చక్రస్నానాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. కార్తీకమాసంలో వచ్చే చిలుక ద్వాదశినాడు శ్రీరాముడి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

సీతారాముల కల్యాణం!
భక్తుల గుండెల్లో కొలువైన సుందర చైతన్య రూపుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత రుతువులో చైత్ర శుద్ధనవమిరోజున పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడట. అరణ్యవాస అనంతరం చైత్రశుద్ధనవమి రోజునే అయోధ్యలో సీతాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల కల్యాణం కూడా అదేరోజున జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామనవమిని వూరూవాడా పండగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ కల్యాణమహోత్సవానికి ఎంతో పేరుపొందిన శ్రీరామ క్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. దాని తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా పేరొందినదే ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయం. భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ కల్యాణ క్రతువుని జరపడం పూర్వంనుంచీ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు. వివాహమహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదంలా పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసంగానీ పరమాన్నంగానీ చేసుకుని తిన్నవారికి కోరికలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కల్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటుచేసిన కౌంటర్ల నుంచి వాటిని తప్పక తీసుకువెళతారు. ఈ నెల ఐదో తేదీన జరగబోయే కల్యాణానికి కనీసం లక్షమందైనా భక్తులు వస్తారన్నది నిర్వాహకుల అంచనా.

ఆలయం గోపురం పైకి ఎక్కిచూస్తే సమీపంలోని అన్ని గ్రామాలు, పచ్చని పంటపొలాలు సుస్పష్టంగా కనిపిస్తాయి శ్రీ కోదండ రాములవారిని ప్రతిరోజు ఉదయం 6 నుండి సాయంత్రం 7 వరకూ దర్శించుకోవచ్చు అలానే అద్దాల మందిరాన్ని ఉదయం 8 నుండి సాయంత్రం 7 వరకూ సందర్శించవచ్చు గోపుర దర్శనం ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ ఉంటుంది @వంగలపూడి శివకృష్ణ

Ref : Enaadu Paper / Vangalapudi Sivakrishna

1818total visits,2visits today

2 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *