Honesty of Peddapurian – Story

పెద్దాపురం ప్రజలు – నిజాయితీ

విజయనగర రాజ్యాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించే రోజుల్లో దక్షిణాది గ్రామమైన పెద్దాపురంలోని ఒకేఒక్క చెరువు అతివృష్ఠి కారణంగా తెగి పోయింది. మిగతా దేశమంతా సుభిక్షంగా పంటలు పండినా… పెద్దాపురం గ్రామానికి మాత్రం తీవ్రమైన కరవు సంభవించింది. దానితో ప్రజలు ఆహారధాన్యాలు లేక తిండికి కటకటలాడసాగారు.

ఆ విషయం తెలుసుకొన్న రాయల వారు, తిమ్మరుసుతో ” అప్పాజీ… పెద్దాపురం ప్రజలు కరువు బారిన పడ్డారన్న సంగతి తెలుసుకదా…. ! వారికి తగిన ఆహారపదార్ధాలను అందించే విషయాన్ని పరిశీలించండి ” అని చెప్పాడు.

” మహారాజా… ! మనం వీటిని యేదో మొక్కుబడిగా ఇచ్చి సరిపెట్టుకుంటే … మిగిలిన రోజులు వారు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి వారికి తిరిగి మళ్ళీ సంవత్సరం పంట చేతికి వచ్చేవరకు అందజేయాలి.. ఈ లోగా చెరువు మరమత్తులు పూర్తి చేయాలి .. ” అని చెప్పాడు.

” అలాగే … తప్పకుండా… ! ఆ యేర్పాట్లు చేయండి.. ” అన్నాడు రాయల వారు.

” మహారాజా…. ముందుగా మూడు నెలలకు సరిపడా ఆహారధాన్యాలను ఆ గ్రామానికి చేర్పించి వాటిని ఒక చోట నిలువ చేసి… అవసరమైన మేర ప్రజలకు పంచే యేర్పాట్లు చేద్దాము. అన్నీ ఒక్కసారిగా ఇస్తే వారు వాటిని దుర్వినియోగ పరచుకొనే వీలుంది.. అందుకని వాటిని గ్రామ పెద్ద దశరధ రామయ్య ఇంటికి చేర్చుదాము.. ఆయన వాటిని అందరికీ అవసరం మేరకు అందించగలడు.. ” చెప్పాడు తిమ్మరుసు మంత్రి.

రాయల వారు అంగీకరించడంతో… పెద్దాపురంలోని జనాభాకు మూడునెలలకు సరిపడా బియ్యం, పప్పులు, నూకలు మొదలైన ఆహార పదార్ధాలను దశరధరామయ్య ఇంటికి చేర్పించాడు. మరుసటి నాటి నుండి వాటిని ప్రజలకు అందజేయాలని దశరధరామయ్యకు చెప్పాడు.

తిమ్మరుసు మంత్రి ఆజ్ఞను స్వీకరించాడు దశరధరామయ్య.

వాటిని దశరధరామయ్య దుర్వినియోగం చేస్తాడేమోననే అనుమానం రాయలు గారికి వచ్చింది అదే విషయాన్ని మంత్రిగారి ముందు వ్యక్తం చేశాదు.

అందుకు తిమ్మరుసు చిరునవ్వు నవ్వి.. ” రాత్రి పూట సంచారం చేయడం మనకు మామూలేగా …. ఈ రాత్రికి పెద్దా పురం వెళ్ళి దశరధరామయ్యను పరిక్షిద్దాం… ” అన్నాడు.

రాయలు గారు తలూపాడు.

ఇద్దరూ మారువేషం లో బయలుదేరి…. పొద్దుగూకే సరికి పెద్దాపురం చేరి…. రహస్యంగా దశరధరామయ్య ఇంటిలో ప్రవేశించి…. బియ్యం బస్తాల మాటున కూర్చున్నారు.

కొద్దిసేపటి తర్వాత….. దశరధ రామయ్య భార్య ఆయనను భోజనానికి పిలిచింది. ఆయన వచ్చి భోజనాల బల్ల దగ్గర కూర్చున్నాడు. ఇద్దరూ కంచాలు పెట్టుకొన్నారు. ఆమె ఒక పాత్రలోనుండి ఉడికించిన గంజిని పోసి, కొంత ఉప్పు… ఒక ఊరగాయ బద్దనును ఇచ్చింది. ఆయన ఊరగాయ సాయంతో గంజిని త్రాగాడు. ఆమె కూడా కొంచెం గంజిని త్రాగి సరిపెట్టుకొంది.

ఇదంతా బస్తాల చాటు నుండి చూస్తున్న రాయల వారు, మెల్లగా తిమ్మరుసుతో…. ” ఇంటి నిండా ఇన్ని ఆహార ధాన్యాలు వుంచుకొని…. ఇలా కేవలం గంజితో సరిపెట్టుకోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… ” అన్నాడు.

చిరునవ్వుతో తలూపిన తిమ్మరుసు…. బస్తాల మాటు నుండి వెలుపలకు వస్తూ…. ” దశరధ రామయ్యా… ! మేము గజదొంగలం…! రాజు గారు నీ ఇంట్లొ వుంచిన సరకుల కోసం వచ్చాము. అయినా నిన్ను చూచి ఆశ్చర్యమేసింది. ఇంటి నిండా ఇన్ని ధాన్యపు బస్తాలుండగా… హాయిగా అన్నం వండుకొని తినక, ఎందుకలా గంజి త్రాగి సరిపెట్టుకున్నావ్…. ? ” అన్నాడు.

” అయ్యా… ! ఇవి కరువుతో అల్లాడుతున్న మా ఊరి ప్రజల కొరకు రాయలు ప్రభువు పంపినవి. మా ఇంట్లో వున్నాయి కదాని … వాటిని నేను వండుకొని తింటే అది దొంగతనమే అవుతుంది..! దొంగతనం మహా పాపం. పైగా రాజ ద్రోహం శిక్షార్హం… ! అందుకే.. ఈ రోజు నా ఇంట్లో వున్న చారెడు నూకలతో గంజి కాసుకొన్నాము. రేపు అందరితో పాటు నాకూ వచ్చే వాటితో జీవనం సాగిస్తాను… ” చెప్పాడు దశరధ రామయ్య.

ఇదంతా వింటున్న రాయల వారు కూడా బస్తాల మాటు నుండి వెలుపలకు వచ్చి, ” దశరధ రామయ్యా.. నీ నిజాయితీ మెచ్చాను. .” అంటూ అభినందించాదు.

అప్పుడు తిమ్మరుసు… తమ అసలు రూపాల గురించి చెప్పగానే ఆశ్చర్యపొయాడు దశరధరామయ్య.

చేతులు జోడించి.. ” మహా ప్రభూ. .. మా ఇంటిని పావనం చేసిన మీకు నా నమస్కారాలు… ” అన్నాడు.

రాయల వారు, తిమ్మరుసులు దశరధరామయ్య గారి నిజాయితీని మరో సారి అభినందించి…. ఆహారధాన్యాల పంపిణీ భారాన్ని ఆయన మీదుంచి తిరిగి విజయ నగరం చేరుకున్నారు

ఆ తర్వాత ప్రతి యేటా విజయ నగరంలో జరిగే వుత్సవాలలొ… ఆ యేడాదికి “ఉత్తమ పౌరుని” గా దశరధ రామయ్యను సత్కరింఛాడు రాయల వారు.

( కథ కల్పితం – నిజాయితీ నిజం) : వంగలపూడి శివకృష్ణ

Ref: published in  “punnami’ Telugu monthly  on march 2011 by K. Adiseshareddy

1087total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *