Jaggery Making in Peddapuram, Peddapuram Bellam
మా ఊరి బెల్లం బట్టీ – ఔషధ పంచదారామృతం
పెద్దాపురం మండలం లోని కట్టమూరు, సిరివాడ, గుడివాడ, కాండ్రకోట, దివిలి, పులిమేరు, చదలాడ, వీరవరం, మర్లావ, ఇలా పెద్దాపురం మండలం లోని దాదాపు అన్ని గ్రామాలు బెల్లం తయారీలో పూర్వకాలం నుండీ ఘనత వహించాయి
కట్టమూరు బెల్లం కాశీ దాకా వెళ్తుంది అనే ఒక నానుడి కూడా వుంది
అలాగే పెద్దాపురం బెల్లం పాటలుగా మారి పుస్తకాలలో చేరి ప్రపంచమంతా చుట్టేస్తోంది
ఆంధ్ర రాష్ట్రంలోనే అనకాపల్లి బెల్లానికి విశేష ప్రాధాన్యం ఉండగా అనకాపల్లి బెల్లం మార్కెట్లో సైతం పెద్దాపురం బెల్లం తయారీ దారులకు / వర్తకులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది…
పెద్దాపురం బెల్లం పై ప్రముఖ రచయిత్రి వింజమూరి అనసూయాదేవి గారు
పెద్దాపురం మంచిబెల్లం సిరి సిరి మువ్వా
తెచ్చి బూరెలొండమన్నాడే సిరి సిరి మువ్వా
బూరెలన్ని వండానె సిరి సిరి మువ్వా
వండి ఉడికాయో లేవాని సిరి సిరి మువ్వా –
నేనే బూరెలన్ని తిన్నానె సిరి సిరి మువ్వా || అంటూ ఒక జానపద గీతం వ్రాసారు
1881 లో జరిగిన ఉత్తర సర్కార్ల రాజకీయ భౌగోళికాంశాల పరిశీలనను అనుసరించి Frederick Ricketts హెమ్మింగ్వే రచించిన తూర్పుగోదావరి గజిట్ లో ఆంధ్ర రాష్ట్రంలో పెద్దాపురం తాలూకా లో బెల్లం తయారీ మరియు ఎగుమతి ప్రధాన పరిశ్రమగా పేర్కొన్నారు
పెద్దాపురం నియోజకవర్గం లోని సామర్లకోటతో పాటుగా పాత పెద్దాపురం, దివిలి, పులిమేరు లాంటి చోట్ల చెరకు ప్యాక్టరీలు ఉండేవి ఇప్పుడు సామర్లకోట ఫ్యాక్టరీ ఒక్కటే ఉంది… చెరకు రైతులకు సరైన గిట్టుబాటు ధరలేక విలవిలలాడుతున్నారు బెల్లం తయారీదారులకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో బెల్లం తయారీ బట్టీలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి భవిష్యత్తులో బెల్లం బట్టీలు అనేపదం వినడానికే గానీ చూడడానికి ఎక్కడా కనపడవు అన్నది అక్షర సత్యం
అన్నట్టు బెల్లం లో ఒక్క చెరుకుబెల్లమే కాకుండా తాటిబెల్లం, ఈత బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లం ఇలా చాలా రకాలున్నాయండోయ్ బెల్లం ఏదైనా అది ఆరోగ్యదాయకం, అనేక పోషకాల సమ్మేళనం కూడాను… బెల్లానికి అనేక ఔషధ గుణాలు ఉండటం వాళ్ళ రోజుకొక వందగ్రాముల బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటే వంద రకాల ఆరోగ్యసమస్యలు తీరతాయన్నది నిపుణుల సూచన అందుకనే బెల్లాన్ని మెడిసినల్ షుగర్ – ఔషధ పంచదార అని కూడా పిలుస్తారు @వంగలపూడి శివకృష్ణ
438total visits,1visits today