Brahmasree Kasi batta Brahmayya Sasthri

బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి

కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలోని భాగమైన పలివెల గ్రామములో బ్రహ్మావధాని మరియు సుబ్బమ్మ దంపతులకు 02 ఫిబ్రవరి,1863 న జన్మించారు. ఎక్కువకాలం కాకినాడ లో గడిపారు.

పెద్దాపురం సంస్థాన చరిత్రము ను విమర్శనాత్మకంగా రచించిన వారిలో విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు పేరు పొందినవారు

బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు. అనేక గ్రంధాలను విమర్శనాత్మకంగా విపులంగా వివరణాత్మకంగా వర్ణించారు రాజా వత్సవాయ రాయ జగపతి వర్మ రచించిన పెద్దాపురం సంస్థాన చరిత్రమును పరిశీలించి విమర్శనాత్మకంగా దానిపై ’’పెద్దాపురం సంస్థాన చారిత్రిక విమర్శనము” పుస్తకం రచించారు, పెద్దాపురం సంస్థానం పరిశిష్టమైన తుని రాజా వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు పెట్టించి శాస్త్రి గారి టుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత ’’పెద్దాపురం సంస్థాన చారిత్రిక విమర్శనము‘ ’రాయించి వెయ్యిన్నూట పదహారు రూపాయలు బహుమానంగా సమర్పించారు. ఇందులో శాస్త్రిగారి లోతైన చారిత్రిక అవగాహన, పరిశీలనా ద్రుష్టి వ్యక్తమవుతుంది.

1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్య మత బోధిని ‘’అనే సభను స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు. కృత్తివెంటి పేర్రాజు, నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్య దీక్షకు మెచ్చి చేయూతనిచ్చారు. ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండాగారం‘’ అనే గ్రందాలయన్నీ స్థాపించారు. మొదట్లో జగన్నాధపురం లో ఉన్న ఈ లైబ్రరీ తర్వాత పెద్ద వీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’ లోకి మార్చారు. కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు. సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు. ఇక్కడే శాస్త్రిగారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు. ప్రసిద్ధులను కూడా ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించేవారు. హరికధా కాలక్షేపాలు కూడా ఏర్పాటు చేశారు. ఆర్య మత బోధిని సభ ద్వారా శాస్త్రి గారు చేసిన హిందూమత సేవ అపారమై నిలిచింది .

శాస్త్రిగారి సారస్వత రచనలు : శాస్త్రిగారు రాసిన అనంతమైన సాహిత్యంలో చాలాభాగం గ్రంథరూపాన్ని సంతరించుకోలేకపోయింది. గుడ్డిలో మెల్లగా శ్రీ నందిరాజు చలపతి రావు పంతులుగారు మతపర వ్యాసాలను సేకరించి ‘’ఉపన్యాస పయోనిధి‘’ పేరుతొ అయిదు సంపుటాలుగా ముద్రింప చేశారు. ఇంకా వారి రచనలు గ్రంధ రూపాలలోకి వస్తే ఇరవై గ్రంధాలు అవుతాయి. శాస్త్రిగారు రాసిన పత్రికా వ్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న పుస్తకంగా ముద్రి౦పబడ్డాయి.

ఉపన్యాస కేసరి శాస్త్రిగారి రచనలు చాలా పత్రికలలో ప్రచురించబడ్డాయి. అలాగే వారు చాలా పట్టణాలలో ఉపన్యాసాలు ఇచ్చారు. శాస్త్రిగారు అమోఘమైన మహా వక్తలు. గంగా ప్రవాహంగా వారి ఉపన్యాస ధోరణి సాగుతుంది. ఎక్కడా తొణకటం, బెణకటం ఉండదు. సభలో వ్యతిరేకులు ఎన్ని అడ్డంకులు కల్పిస్తున్నా అల్లరి చేస్తున్నా తమ ప్రసంగాన్ని కొనసాగించి విజయ దుందుభి మ్రోగించేవారు. మాధుర్యమైన పదప్రయోగం శాస్త్రిగారి ప్రత్యేకత. రచనలో గ్రాంధికమే వాడారు. వందలాది సభలలో ప్రసంగించారు. ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు. ఆంధ్రదేశంలో బరంపురం లో ‘’ఆంధ్ర సారస్వత సభ’’, గుంటూరులో నిర్వహించిన ‘’నిఖిలాంధ్ర దేశ వర్ణాశ్రమ ధర్మ మహా సభ ‘’ లలో శాస్త్రిగారే అధ్యక్షత వహించారు

రచనలు

 • సంస్కారవిషయకముగా వీరువ్రాసిన వ్యాసములు 24.
 • అధ్యాత్మవిషయక వ్యాసములు 17.
 • మతధర్మవిషయక వ్యాసములు 43.
 • సాహిత్యవిషయక వ్యాసములు 60.
 • కవిత్వవిషయక వ్యాసములు 16.
 • ప్రకృతిశాస్త్రవిషయక వ్యాసములు 11.
 • నన్నయ్యభట్టారక చరిత్రము,
 • కురుపాండవ దాయభాగనిర్ణయము,
 • మంగతాయి,
 • సైంధవవధ
 • ఉపన్యాసపయోనిధి (1 సంపుటము)
 • తారకతారావళి,
 • పర్వతసందర్శనము,
 • మనువసుప్రకాశిక,
 • పెద్దాపురసంస్థాన చరిత్రము,
 • ప్రాయశ్చిత్తపశునిర్ణయము,
 • భాస్కరోదంతము మున్నగునవి ప్రత్యేకగ్రంథములు.
 • ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక-భారతి-శారద-ఆంధ్రపత్రిక ఉగాదిసంచికలు-ముద్దుల మూట-ఉదయలక్ష్మి-సుజాత మొదలైన పత్రికలలో వీరి రచనలు గలవు.

బిరుదులు, సత్కారాలు :  శాస్త్రిగారికి ఏలూరు, సామర్లకోట, నెల్లూరు, కడప, కూరాడ, కిర్లంపూడి మొదలైన పట్టణాలలో ఘన సన్మానాలు నిర్వహించి సత్కరించారు.

 • విజయనగరం లోని ‘’ఆంధ్ర సారస్వత సభ‘’ శాస్త్రిగారికి ‘’విమర్శకాగ్రేసర‘’ బిరుదునిచ్చి సన్మానించింది.
 • ఏలూరు ‘’విద్వద్వర విద్వాద్త్ప్రభు‘’ సంస్థ ‘’మహోపాధ్యాయ‘’ బిరుదమునిచ్చి ఘనంగా సత్కరించింది.
 • నెల్లూరు ‘’విద్వజ్జన మహాసభ‘’ వారు “ఉపన్యాసక పంచానన’’ బిరుదును అందజేసింది.
 • కొవ్వూరు ’’ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం‘’ వారు ’’ఆర్య మతోద్ధారక‘’ బిరుదం ఇచ్చి సత్కారం చేసింది.

మరణం : ’’బ్రహ్మయ్య శాస్త్రిగారు మరణించారు’’ అనే వార్త ఒకటి పొరబాటున పత్రికలో వచ్చింది. 1930 సెప్టెంబర్ లో రాజమండ్రికి చెందిన కాశీభట్ట లింగమూర్తి శాస్త్రి గారు అనే ఆయన చనిపోతే హిందూ పత్రిక విలేకరి దాన్ని బ్రహ్మయ్య శాస్త్రిగారికి లంకెపెట్టి బ్రహ్మయ్య శాస్త్రిగారు పరలోక గతులయ్యారని వార్త పంపాడు. దీన్ని చూసి ఆంధ్రపత్రిక కూడా వంత పాడింది. ఇంకాస్త ముందుకు వెళ్ళిన ఆంధ్రపత్రిక బ్రహ్మయ్య శాస్త్రిగారి మరణానికి సంతాపం ప్రకటించి ఆయన సాహిత్య సేవను బహువిధాల సంపాదకీయంలో ప్రస్తుతించింది. ఈ వార్త చదివిన ఆంధ్ర దేశంలోని సాహిత్యాభిమానులు హిందూమతాభిమానులు విచారం వెలిబుచ్చుతూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సభలు జరుపుతూ లేఖలు కూడా రాసేశారు. వీటిని పట్టించుకోకుండా శాస్త్రిగారు తమ సాహితీ కృషిని కోనసాగిస్తూనే ఉన్నారు. పత్రికలకు వ్యాసాలూ రాస్తూనే ఉన్నారు; అవి అచ్చు అవుతూనే ఉన్నాయి. శాస్త్రిగారు అఖండ ఆంధ్ర సోదరుల సౌహార్దం చేత, భగవత్క్రుప చేత తాను సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూనే ఉన్నానని ఆంధ్ర పత్రికా సంపాదకునికి లేఖ రాశారు. అప్పుడు ఆ పత్రిక అసత్య వార్తను నమ్మి తాము శాస్త్రిగారి విషయంలో పొరబాటు చేశామని దీనికి చాల చింతిస్తున్నామని శాస్త్రిగారు సంపూర్ణారోగ్యంతో ఉన్నందుకు అభినందనలు తెలిపి బహిరంగ క్షమాపణ కోరింది. ఇదంతా చూడటానికి, వినటానికి తమాషాగా చిత్రంగా ఉందనిపించింది శాస్త్రి గారికి; వెంటనే ‘’నా విబుధ లోక సందర్శనము‘’ అనే చమత్కార వచన కావ్యం రాసారు.

అక్టోబర్ 29, 1940లో మరణించారు.

By వంగలపూడి శివకృష్ణ
రిఫరెన్స్ : Wikipediya

 

2995total visits,6visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *