Mullapudi Sriramamurty – Peddapuram
పెద్దాపురంలో పుట్టి పెరిగిన ప్రముఖ మృదంగం విద్వాంసుడు శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 08 ఏప్రిల్ 1943 న ముళ్ళపూడి లక్ష్మణరావు దంపతులకు జన్మించారు… ఈయన తాతగారైన శ్రీ వడలి వెంకటనారాయణ గారు మరియు ముత్తాత గారు శ్రీ వడలి చంద్రయ్య గార్లు ము ముత్తాత వడలి వెంకయ్య గార్లు కూడా పెద్దాపురం వారే మరియు వారి కుటుంబీకులు పెద్దాపురం సంస్థానంలో రాజరిక కాలం నుండీ కూడా ప్రసిద్ధి చెందిన మృదంగ విద్వాంసులు… కుటుంబీకులంతా మృదంగ విద్వాసులు కావడంతో శ్రీ రామ మూర్తి గారికి చిన్నతనం నుండీ మృదంగం వాద్య పటిమ అలవడింది… 11 సంవత్సరాల వయస్సులోనే తన తొలి కచేరిని ఇచ్చి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేశారు… దురదృష్టవశాత్తూ తల్లి గారు చనిపోవడంతో 1955 లో విజయనగరం వలస వెళ్లారు… అక్కడే తండ్రి లక్ష్మణరావు గారి శిష్యరికంలో నౌడూరు వెంకట్రావు, కాట్రావులపల్లి వీరభద్రరావు, ధర్మాల వెంకటేశ్వరరావు, వంకాయల నరసింహమూర్తి, ముళ్ళపూడి సూర్యనారాయణ తదితర సహాధ్యాయులతో మృదంగం విద్య నేర్చుకునేవారు…
1956లో కాకినాడలో జరిగిన సంగీత పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతి పొందాడు. ఆ తరువాత విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాలలో శ్రీ కోటిపల్లి గున్నయ్య గారి వద్ద వయొలిన్ నేర్చుకున్నారు. మృదంగం మరియు వయొలిన్ రెండు విద్యలూ సాధన చేసేవారు శ్రీరామ మూర్తిగారి 20 సంవత్సరాల వయసులో 1963లో జరిగిన అఖిల భారత సంగీత పోటీలలో ద్వితీయ స్థానం సంపాదించుకుని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా సత్కరించబడ్డారు…
1965 లో ఆకాశవాణీ – ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు… 02 ఫిబ్రవరి 1966 లో నాగమణి గారితో కశింకోటలో వివాహం జరిగింది….
శ్రీరాంమూర్తి గారు ఎంతో ప్రసిద్ధి చెందిన కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీత కళాకారులతో సమానంగా ప్రతిభ కనబరిచేవారు… మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సేమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, కె.వి.నారాయణ మూర్తి, మహారాజపురం సంతానం మరియు నేదునూరి కృష్ణమూర్తి వంటి ఇతర గొప్ప వ్యక్తులతో కలిసి అనేక కచేరీలలో పాలు పంచుకున్నారు… మరీ ముఖ్యంగా ప్రముఖ సంగీత కళాకారులు పాల్గాట్ మణి అయ్యర్, కోలంకి వెంకటరాజు, తిరుపతి రామానుజ సూరి, మహదేవ రాధాకృష్ణరాజు, దండమూడి రామమోహనరావు, వి.కమలాకరరావు, ధర్మాల రామమూర్తి మొదలైన వారి కచేరీలకు మృదంగ సహకారం అందించారు
తాను నేర్చుకున్న విద్యను ఎంతగానో ప్రేమించిన మృదంగ విద్వన్మణి ముళ్ళపూడి శ్రీ రామమూర్తి గారు తాను నేర్చుకున్న విద్యను ఎందరికో నేర్పించారు కూడా ఎందరినో ప్రియ శిష్యులుగా చేసుకున్నారు… ఆయనకి జీవితకాలంలో ఎన్నో అవార్డులూ ఎన్నెన్నో రివార్డులూ వరించాయి.. ఎందరో ప్రముఖులనుండి ప్రశంసలు… సన్మానాలు పొందారు… మృదంగ గాన సాగర, మృదంగ రత్నాకర, సునంద మృదంగ విద్వన్మణి, మృదంగ సార్వభౌమ బిరుదాంకితులైన శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు తమ 71 సంవత్సరాల వయసులో 10 జూలై 2014న అనారోగ్య కారణంగా మరణించారు ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి గారు, శ్రీ ధన్వాద ధర్మారావు గారు, శ్రీమతి మందపాక నాగలక్ష్మి గారు, విశాఖ సంగీత అకాడమీ కార్యదర్శి శ్రీ ఎం ఎస్ శ్రీనివాస్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ సంగీత విభాగాధిపతి అనురాధ గారు, అయ్యాల సోమయాజులు గారు మరియు శ్రీ రామ జోగారావు గారు వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు ఆయన మృతి పట్ల నివాళులు అర్పించారు ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారి భార్య నాగమణి గారు మరియు ఇద్దరు కుమారులు ప్రస్తుతం విశాఖపట్నం లో జీవిస్తున్నారు
ఇలా ఎందరో మహానుభావులు మనకు తెలియని గొప్ప కళాకారులు చారిత్రక పెద్దాపురానికి చెందినవారు ఉన్నారు వారందరినీ మన పెద్దాపురం గ్రూప్ ద్వారా మీకు పరిచయం చేస్తాం పెద్దాపురం గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్తాం
1791total visits,1visits today