PEDDAPURAM HANDLOOMS HISTORY

పెద్దాపురం చేనేతకి ప్రపంచవ్యాప్త ఖ్యాతి

మన భారత దేశానికి ప్రాచీన వారసత్వ సంపదగా సంక్రమించిన కళలలో చేనేత కూడా ఒకటి… వందల సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగి వృత్తి కళగా పరిణామం చెంది కుటీర పరిశ్రమలు స్థాపించబడి ఎందరికో ఉపాధి కల్పించి నేడు కుంటుబడిపోయిన ప్రాచీన కళలో పెద్దాపురం చేనేత కళాకారులు నిష్ణాతులు….

పెద్దాపురం పట్టు వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చిన గొప్ప కళాకారులు పెద్దాపురంలో ఉన్నారు… 1933 డిసెంబరు 24జాతిపిత మహాత్మా గాంధీ గారు పెద్దాపురం పట్టణాన్ని సందర్శించినప్పుడు పెద్దాపురం పట్టు వస్త్రాల తయారీని స్వయంగా చూసి, విదేశాలకు సైతం పెద్దాపురం సిల్కు వస్త్రాలు ఎగుమతి అవ్వడం విని ఎంతో ఆశ్చర్యపోయారు… పెద్దాపురం సిల్కుకు స్వదేశీ సిల్కు అని నామకరణం చేశారు…

1924 సంవత్సరంలో లండన్లో జరిగిన చేనేత వెంబ్లే ఎగ్జిబిషన్లో పెద్దాపురం చేనేత వస్త్రాలకు బంగారు పథకం లభించింది… 1930 లో ముప్పన వారి విశేష కృషితో పెద్దాపురం పట్టు వస్త్రాలు సింగపూర్ లాంటి దేశాలలో ప్రదర్శనకు నిలిచి వస్త్రాభిమానులైన విదేశీయులను సైతం అబ్బుర పరచడం విశేషం… అలాగే 1937 సంవత్సరంలో లక్నోలో జరిగిన అఖిలభారత చేనేత వస్త్ర ప్రదర్శన పోటీలలో జట్లా వారి కుటుంబానికి చెందిన జట్లా సత్యం గారు బంగారు పధకం సాధించి పెద్దాపురం పట్టు వస్త్రాల ఖ్యాతిని ఇనుమడింపచేశారు ఇవన్నీ పెద్దాపురం చేనేత యొక్క ఘనతకి మచ్చుతునకలు…

ఇక పెద్దాపురం లో చేనేత పుట్టుక ఆవిర్భావాన్ని గురించి ప్రస్తావించవలసి వస్తే ముప్పన వారి కుటుంబం గురించి ప్రస్తావించవల్సి వస్తుంది… వారి శ్రమ… ఆలోచన… దూరదృష్టి… పెద్దమనసు అన్నే కలిస్తేనే పెద్దాపురం లో సిల్కు పరిశ్రమల ఆవిర్భావం జరిగింది అని చెప్పవచ్చు. ముప్పన వంశానికి చెందిన ముప్పన అంకయ్య గారు బట్టల వ్యాపారం చేసేవారు తలపై బట్టల మూట పెట్టుకుని వాడ వాడ కీ తిరిగి వస్త్రాలు అమ్మేవారు అతని వ్యాపారం దిన దిన ప్రవర్ధమానపై ఆయన కుమారులు పెద్దవారయ్యే నాటికి ముప్పన వారి కుటుంబం ఆర్ధికంగా… సామాజికంగా మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు

వారి వారసులైన ముప్పన సోమరాజు వీర్రాజు లు మంచి విద్యావంతులు మరియు మిక్కిలి తెలివైన వారు కావడంతో పెద్దాపురం పట్టణంలో 1914 వ సంవత్సరంలో సిల్కు చేనేత పరిశ్రమను స్థాపించారు. వెయ్యి సిల్కు మగ్గాలపై చేనేత కార్మికులు వస్త్రాలు నేచేవారు. ఈ పరిశ్రమలపై ఆధారపడి సుమారు 20 సిల్కు మిల్లులు ద్వారా నూలు తయారయ్యేది. పెద్దాపురం సిల్కు వస్త్రాలు నేసే కార్మికుల ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు వారందరికీ ముప్పన వారు 80 ఎకరాల పైచిలుకు వ్యవసాయ స్థలాన్ని కేటాయించి వారికి ఇళ్లస్థలాలు ఇప్పించి ఇల్లు నిర్మింప చేశారు, దీంతో పెద్దాపురంలో వీవర్స్ కోలనీలు, అంకయ్యపేట, వీర్రాజుపేట, సుబ్బయ్య పేట, నాగమ్మ పేటలు చేనేత వాడలుగా రూపు సంతరించుకున్నాయి… పెద్దాపురం పట్టు చీరలు, పట్టు పంచెలు… పట్టు వస్త్రాలు ప్రపంచకీర్తి గడించే దిశగా ప్రయాణం మొదలైంది

పెద్దాపురం స్వదేశీ సిల్కు కి మద్రాసు, కలకత్తా, ఢిల్లీ, బొంబాయి లాంటి మహా నగరాలలో హోల్సేల్ సిల్కు వస్త్రాల బ్రాంచిలు ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకూ సిల్కు వస్త్రాల సరఫరా జరిగేవి. శ్రీలంక, బర్మా దేశంలో సైతం పెద్దాపురం సిల్కు వస్త్రాల బ్రాంచ్లు నిర్విహించబడ్డాయి. విదేశాలకు సైతం పెద్దాపురం పట్టు వస్త్రాలు ఎగుమతి చేయబడేవి… ముప్పన వారిని అనుసరించి పెద్దాపురంలో అనేక కుటుంబాలు చేనేత బాట పట్టాయి వారిలో జట్లా వారు, మలిపెద్ది వారు, బోప్పేవారు, పీసాలవారు, ఇనుమర్తి వారు, తమ్మన వారు, చిట్టంశెట్టి వారు, కటకం వారు, పిచ్చుక వారు, పడాల వారు, గొల్ల, జెట్టి, తాళ్లూరి వారు, అంకం వారు, ఇంకా అనేక మంది చేనేత రంగంలో ప్రవేశించి పెద్దాపురం చేనేత పరిశ్రమకు వన్నెలద్దారు

పెద్దాపురం పట్టణంలోని చేనేత సొసైటీలలో చేనేత కార్మికులు తయారుచేస్తున్నటువంటి చేనేత వస్త్రాల యొక్క నాణ్యతా ప్రమాణాలు, నైపుణ్యత ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ఆప్కో డైరక్టర్‌, పెద్దాపురం చేనేత సొసైటీ అధ్యక్షులుగా ముప్పన వీర్రాజు, గాంధీ సొసైటీ అధ్యక్షులుగా తూతిక సత్యనారాయణ, ఆప్కో ఇనస్పెక్టింగ్ అధికారిగా ఆర్. శ్రీనివాస్, జూనియర్ టెక్నికల్ అధికారి గా జయకృష్ణ, మేనేజర్లుగా ఆశపు సాంబమూర్తి, తూతిక చంద్రశేఖర్, తదితరులు సభ్యులుగా వున్నారు వీరి హయాంలో పెద్దాపురంలో ఉన్న రెండు చేనేత సొసైటీలు లాభాల బాటలో ఉండడం అభినందనీయం ఇటీవల చేనేత జౌళి శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు పెద్దాపురం విచ్చేసి పెద్దాపురం చేనేతకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఇక్కడ చేనేత మరింతగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని భరోసా ఇవ్వడం ఆనందదాయకం

చేనేత పరిస్థితి పై చిరు కవిత

అగ్గి లాగ మండుతుంది మగ్గం
రగులుతుంది రగులుతుంది రాట్నం
సంక్షోభం తాళలేక తత్తర పడుతున్నది
మనుగడ సాధించలేక మధన పడుతున్నది

ఇంటిలోన, వంటి మీద నూలు పోగు లేకుండా
నూలు వడుకున్న ఆ నేతన్నల కష్టం చూసి
కన్నీరు… మున్నీరై… క్షణం కూడా ఆగలేక
వణుకుతుంది… వణుకుతుంది… వస్త్రం

చితికిన చేనేత యొక్క
ఘన చరిత్ర గతమాయెను –
చేనేత కతలు వెతలాయెను
నేత కళలు కనుమరుగాయెను

గతమంతా ఘనం – ఇప్పుడు బ్రతకడమే గగనం !

@వంగలపూడి శివకృష్ణ

3207total visits,12visits today

3 Comments

Add a Comment

Your email address will not be published. Required fields are marked *