Peddapuram History Book

 

పెద్దాపురం చాటువులు

 

“వందలాది వచనాల ఏకవాక్య సారాంశం పద్యం” ఒక్క పద్యం లో ఎన్నో విశేషాలు తెలియజేయవచ్చు అలాంటి అద్భుతమైన పదబంధాల అల్లిక ద్వారా పద్యాన్ని హృద్యంగా ఆవిష్కరించడంలో పెద్దాపురం పూర్వ పండితుల ప్రతిభ అనన్య సామాన్యం… పెద్దాపురం చరిత్రను పరిశీలించినట్లయితే ఎందరో మహా కవులు పోషించబడ్డారు పెద్దాపురంలో నిరంతరం సాహితీ ధార ధారాళంగా ప్రవహించింది శతావధానాలు విరివిగా జరిగి కవుల ఖార్జానా గా పెద్దాపురం విలసిల్లింది, కవులు  పండితులు వారి వారి పద్యాలు, కవిత్వాలు ద్వారా పెద్దాపురం దేవతా మూర్తులను వారి మహిమలను పెద్దాపురం కళలను, సంస్థాన కళా వైభవాన్ని, పెద్దాపురం సంస్థానాధీశుల ధీరోదాత్తతను వర్ణించడం జరిగింది… అలాగే వివిధ సందర్భాలలో ఆ కాలంలో మహారాజులు మహా మంత్రుల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలను చాటు పద్యాలుగా రచించడం జరిగింది అవన్నీ కూడా ఈ పుస్తకంలో మీకందించే ప్రయత్నం చేస్తున్నాం… ఈ పుస్తకంలోని పద్యాలను అంశాలను మీరు స్వేచ్ఛగా అందరికీ పంచుకోవచ్చు పెద్దాపురం ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా పెద్దాపురం చరిత్ర వైభవాన్ని సాధ్యమైనటువంటి అన్ని రీతులలో  ప్రపంచానికి తెలియజేయడమే ఈ పుస్తకం వ్రాయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం  ఇది పెద్దాపురం ప్రజలకే అంకితం ఈ పుస్తకంపై సర్వ హక్కులు పెద్దాపురంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ ఉంటాయి

 

పెద్దాపురం గ్రామ దేవత మరిడమ్మ అమ్మవారి మహిమపై హారి హరాదులూ ఇంద్రాది దేవవతలకి సైతం అనుచిక్కని మహా మహిమాన్వితురాలవైన ఓ మరిడి మహాతల్లీ విషపు గాలులు వీచుచోట నీపాదస్పర్సచే ఆగాలులు పోగొట్టి మాయమ్మవై నిలచి మమ్ము బ్రోచుమని వేడుకొంటున్న ఒకానొక చాటుపద్యం

|||| హరియైనా హరుడైన నింద్రుడైనా అబ్జాసనుండైన ని

             న్నెఱుంగంజాలరు నీ మహామహిమ మాకెంచంగ శఖ్యంబటే

             పరదేవీ విషజాతమారుతవల త్పాదద్వయా దూరమై

            మరిడీదేవతా ! మమ్ము బ్రోవగదవమ్మా పొమ్మ మాయమ్మవై

@దేవతా స్తుతి స్తబకము వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చాటుపద్య మణిమంజరినుండి

 

అలాగే పెద్దాపురం మరో గ్రామ దేవత పరదేశమ్మ పై ఆచార్య అల్లంరాజు లక్ష్మీ పతి మాస్టారు గారు రచించిన పద్యం
పరదేశమ్మ! తల్లి !
కరుణను బ్రసరింపజేసి , కలకె లవల్మన్
మురువుగ బ్రోవుము తప్పక
కరయుగ్మము మోడ్చి నీదుకడగల భక్తున్

 

వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి మొట్టమొదటి అవధానం ఆతని 17 సంవత్సరాల వయసులో పెద్దాపురంలో జరిగింది అని ఆయన చెప్పుకున్నారు… అయన ఆరోజు చెప్పిన పద్యం

ఏ పురమందొ చేయుటది ఎంత ముదంబొ ! కవిత్వ ధారణా

టోపమొ ఏమొ ! బాలుడితడున్‌ గరుణింపుము శారదాంబ ! పె

ద్దాపురవాస పండిత సదస్యుల దాపున పేరు నిల్ప …………..’

 

ఈ పద్యాన్ని బట్టి పెద్దాపురం వాసుల పాండిత్యం ఎంత ప్రసిద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు వేదుల సత్యానారాయణశాస్తి గారి జీవితంపై పరిశోధన గ్రంధం సమర్పించి డాక్టరేటు పొందిన పంపన సూర్యనారాయణ గారు పెద్దాపురం ప్రశస్థి పై ఆశువుగా చెప్పిన చాటుపద్యం

సీ||

ఇట పాండవుల మెట్ట ఇతిహాసముల పుట్ట వత్సవాయి పతుల ప్రభల పట్టు

ఇటనేన్గులక్ష్మణ కృత సుభాషితములు తెలుగుటెదల త్రుప్పుడులిచికొట్టు

ఇటు పట్టువస్త్రాల కితరదేశాధీశ పత్నులు సైతంబు పట్టుబట్టు

ఇట మరిడమ్మయూరేగు నుత్సవము సమస్త కళాపూజ కాటపట్టు

 

 

తే.గీ||

 

బుచ్చి సీతమ్మ ఈవి పెంపును నిలిపెడి

 

సత్రశాల వెంబడి కళాశాల వెలయ

 

తనవని మురిసిపోవు పెద్దాపురంబు

 

కడు పురాతన సంస్థాన ఘనత కలిగి

పెద్దాపురం యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను మొత్తం పెద్దాపురాన్ని ఒక చాటు పద్యంలో ఆయన వర్ణించిన తీరు అనన్య సామాన్యం  పెద్దాపురం ప్రజలు ఆయనకీ ఎప్పటికీ రుణపడి ఉంటారు

 

ఇక చారిత్రక కవులలో పెద్దాపురం సంస్థానాధీశుల ద్వారా పోషించబడిన ఏనుగు వంశపు కవులు పెద్దాపురం చరిత్రను ప్రతిభింబించే ఎన్నో పద్యాలను రచించడం జరిగింది…. ఏనుగు వంశపు కవులు పెద్దాపురం సంస్థానం ఆవిర్భవించిన నాటినుండీ పెద్దాపురం సంస్థానంలోని కవులుగా ప్రసిద్ధి చెందిన వారు, బర్తృహరి సుభాషితాలు తెలుగులోకి ముగ్గురు మహాకవులు అనువదించడం జరిగింది వారు ఏనుగు లక్ష్మణ కవి , పుష్పగిరి తిమ్మకవి, ఏలకూచి బాలసరస్వతి మహా కవులలో మిక్కిలి పేరుపొందిన వారు ఏనుగు లక్ష్మణ కవి . కూచిమంచి తిమ్మకవి ఏనుగు లక్ష్మణ కవిని ప్రశంసిస్తూ ఒక పద్యం రచించడం జరిగింది

గీ||  భారతీ వదనాంబుజ భ్రాజమాన
కలిత కర్పూర తాంబూల కబళ గంధ
బంధురంబులు నీ మంజుభాషణములు
లలితగుణధుర్య! యేనుఁగులక్ష్మణార్య!

 

ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురం సంస్థానాధీశుల ప్రోత్సాహంతో బర్తృహరి సుభాషితాలు తెలుగులోకి అనువదించడమే కాక పెద్దాపురం చరిత్రలోని కీలకమైన అంశాలను వారి రామవిలాసం పద్యాలద్వారా రచించి పెద్దాపురం ప్రభువులకు అంకితం ఈయడం జరిగింది,

 

ఈ రామ విలాసంలో పెద్దాపురం సంస్థానమును పరిపాలించిన శ్రీ వత్సవాయ రాజ వంశీయులు సూర్యాన్వయ సంభవులనీ వీరికి మూల పురుషుడు సాగి పోతరాజు అని ఏనుగు లక్ష్మణ కవి గారు వర్ణించిన విషయం ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తున్నది

 

శ్రీవిష్ణునాభిరాజీమధ్యంబున బ్రభవించె విశ్వనిర్మాత ధాత.
యంభోజభవునకు సంభవించె మరీచి యతనికి గశ్యపుండతవరించె
గశ్యపబ్రహ్మకు గలిగె బ్రహ్మాండదీపకుడు త్రయిమూర్తి భాస్కరుండు
ననజముత్రునకు వైవస్వతుండుదయించె ఘనుడు వైవస్వతమనువు గాంచె

 

దక్షు నిక్ష్వాకునకునృపుని దద్వంశమునను
దగ గకుత్ధ్సుండు రఘువును దశరథుండు
జనన మొందిరి యాదశస్యందనునకు
రాముడు జనించె ద్రిభువనరక్షకుండు

 

ఏతాదృళ మహాశీపురుష భూషితం బైన నూర్యాన్వయంబు సాగి వంశం బనం గ్రమంబుగఁ బ్రసిద్ధం బయ్యె 

 

పై పద్యం లో ఉన్న అంశాలకు సంబందించిన శాశనాలు  కృష్ణా జిల్లా నందిగామ లో ఉన్న గుడిమెట్ట ముక్త్యాల అనుమంచే పల్లె, పెనుగంచిప్రోలు, విజయవాడ అలాగే తూర్పు గోదావరి జిల్లా లోని ద్రాక్షారామం,  లోని దేవాలయాలవద్ద ఉన్నట్లుగా చారిత్రక పుస్తకాలు ద్వారా చెలియుచున్నది

 

ముక్త్యాల గ్రామంలో చెన్న కేశవ స్వామీ దేవాలయం యొక్క తూర్పు ప్రాకారానికి దగ్గరగా పాతి పెట్టినటువంటి “నాగులబండ” అనే స్థంబం మీద వ్రాసిన శాసనం ప్రకారం వత్సవాయి వంశస్థుల వంశక్రమం ఈ విధంగా అర్ధం చేసుకోవచ్చు”

 

“విష్ణువు నాభి నుండి బ్రహ్మ – బ్రహ్మ నుండి దుర్జయుడు – దుర్జయుడు వంశమున ముప్పరాజు – ముప్పరాజు వంశమున గోంక దొరపరాజు – దొరపరాజుకి పోతరాజు – పోతరాజు రాజాంభిక దంపతులకు త్యాగరాజు(చాగి రాజు) – అతనికి దోరపరాజు – అతనికి చాగి పోతరాజు – అతనికి నరశింహ రాజు – అతనికి మనుమ పోతరాజు మరియు మాచరాజు అను ఇద్దరు – వీరిలో మాచరాజుకి ఎఱ పోతరాజు – ఎఱ పోతరాజు కి తెలుంగు రాజు మరియు రామ రాజు అను ఇద్దరు – రామ రాజుకి తెలుగు రాజు – తెలుగు రాజు వంశమున తిరుమల రాజు – అతనికి నాగ రాజు – వారికి తిరుపతి రాజు – తిరుపతి రాజుకి ఇద్దరు భార్యలు వారిలో అమ్మయ్యమ్మ కి సింగ రాజు మువ్వయ్యమ్మ కి జగ్గరాజు అని వీరిలో జగ్గరాజుకి పేర రాజు వారికి ముసలి తిమ్మరాజు – జగ్గరాజు అను ఇద్దరు – ఇందులో ముసలి తిమ్మరాజుకి రాయప రాజు, గోపాల రాజు, రామ చంద్ర రాజు అను ముగ్గురు – వీరిలో రాయప రాజు సూరాంభ దంపతులకి సార్వభౌమ తిమ్మరాజు, భలబద్ర రాజు అను ఇద్దరు వీరిలో భలబద్ర రాజు కి రెండవ రాయప రాజు (ఉద్దండ రాయ జగపతి) రాగమ్మ దంపతులకి మూడవ తిమ్మ రాజు, భల భద్ర రాజు, సూరప రాజు అనే ముగ్గురు – వీరిలో మూడవ తిమ్మరాజు రాయజగపతి రాజు – జగపతి రాజు సీతాంబ దంపతులకి నాల్గవ తిమ్మ జగపతి(విధ్వత్తిమ్మ జగపతి) విధ్వత్తిమ్మ జగపతి కి ఇద్దరు బార్యలు ( అచ్యుతాయమ్మ, బంగారయమ్మ) వీరికి రాయ జగపతి రాజు

 

వత్సవాయ వంశమునకు మూలపురుషు లలో ఒకడైన చాగి పోతరాజు కృషాజిల్లాలోని గుడిమెట్టను రాజధానిగా చేసుకొని పరిపాలించాడని ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ గణపతి దేవ మహారాజు కాలము నాటి వాడు గణపతి దేవా మహారాజు చెల్లిని చాగి పోతరాజు రెండవ కుమారుడైన చాగి బుద్దరాజు కి ఇచ్చి వివాహం జరిపించాడనేది చరిత్ర…

 

శ్రీకృష్ణ వేణ్ణాతట భూమిభాగే

శ్రీ పోతభూపో గుడిమెట్ట నామ్నీ

విశ్వేశ్వరాఖ్యం శివమాదిదేవం

సంస్ధాపయా మాస పురే—”  (Arc-300/1924 )

 

చాగి మనుమ పోతరాజు అనుమంచిపల్లి శాసనం లో  క్షత్రియుడు గా ప్రకటించుకున్నాడు. (Arc -283/1924 )

 

“ —– బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర విధయా వర్ణాశ్చతుర్ధా క్రమాత్,

తత్రాస్తి బాహుజ కులాభరణం తపోభిర్వప్పర్ల  వంశ  ఇతి – ”(Arc-527/1913) .

 

అయితే చాగివారు విష్ణు పాద పద్మోద్భవులని వినుకొండ శాసనం చెపుతోంది.

 

“శ్రీ లక్ష్మీ పతి పాద పద్మ జనితోవర్ణాశ్చతుర్ధా భవ

తస్మిన్నేతన్మమమ నాయక: సమజని శ్రీ సాగి వంశోద్భవ: ”(Arc-527/1913).

 

పూర్వకాలపు కవులు పండితులు పురోహితులు రాజ్యాధికారంలో ఉన్న మహారాజుల యొక్క వంశావళి వ్రాసే క్రమంలో వారికి తెలిసిన, వివరాలు అందుబాటులో ఉన్న మూల పురుషులవరకూ వ్రాసి ఆపైన పురాణ పురుషులను వారి తండ్రులుగా వ్రాసే వారు, రాజులను పురాణ నాయకులైన విషుమూర్తి, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు వంటి వంశాలకు వారసులుగా మొదలుపెట్టి వాటి చారిత్రక ఆధారాలను శాశనాలుగా వ్రాయించడం చేసేవారు అందుచేత పై శాసనం అనుసరించి వత్సవాయి వారి మూలపురుషుడు దుర్జయుడుగానే ప్రకటించవలసి ఉంది ఎందుకంటే  దుర్జయుడు అనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలన చేసాడని అప్పటి కళింగ ప్రాంతమైన శ్రీకాకుళం, విశాఖపట్టణం, గంజాం ప్రాంతాలు ఈ దుర్జయ మహారాజు అధీనం లోనివని కొన్ని చారిత్రిక రచనల ద్వారా తెలియుచున్నది, అలానే ఇంపూరు శిలాశాసనం ప్రకారం కళింగ దేశాన్ని క్రీస్తు శఖం 540 నుండీ 611 వరకూ పరిపాలన చేసిన మూడవ విష్ణు కుండిన మహారాజు మాధవ వర్మ    దుర్జయుని ఓడించినట్లు గా తెలుస్తోంది. మరి ఆ దుర్జయుడూ ఈ దుర్జయుడూ ఒకరేనా అనే విషయం ఏ చారిత్రిక గ్రంధాల లోనూ లభించలేదు కనుక ఈ విషయంలో స్పష్టత లేదు

 

 

 

ఈ క్రింది చాటుపద్యం చాగి పోతరాజు గురుంచి తెలియజేస్తుంది

సహ్యజాతీరమునకు భూపణ మనంగ

సిరుల కిర వసగుడిమెట్టపురము దనకు

రాజధానిగా సత్కళా భోజరాజు
సాగి పోతక్షమాభర్త జగతి యేలె

 

12వ శతాబ్దపు చివరిలో అనగా 1178 నుండి 1182 సంవత్సరం మధ్యకాలంలో 4 సంవత్సరాల పాటూ కొనసాగిన పలనాటి యుద్ధంలో నలగామరాజు తనకు సహాయంగా రమ్మని కొంతమంది రాజులకు లేఖలు వ్రాసినట్లుగా చరిత్ర పుస్తకాల ద్వారా తెలుస్తుంది… అందులో భాగంగానే పెద్దాపురం సంస్థానానికి మూల పురుషుడైన సాగి పోతరాజుకి కూడా లేక వ్రాసినట్టు క్రీస్తుశకం 1178 నుండి 1182 వరకూ జరిగిన అరివీర భయంకర పలనాటి యుద్దంలో నలగామ రాజునకు సహాయం గా తన సైన్యంతో వచ్చి అద్భుత మైన పోరాట పటిమ కనబరిచినట్ట్లుగా చెన్నై లోని లిఖిత పుస్తక భాండాగారం లోని పలనాటి వీర చరిత్రము అను గ్రంధం లోని 168 వ పేజీ ద్వారా తెలుస్తుంది అలాగే గుడిమెట్ల సాగి పోతరాజు గారు గురించి వీరి వంశము గురించి శ్రీ చిలుకూరి వీరబద్ర రావు పంతులు గారు తను రచించిన ఆంధ్రుల చరిత్ర ద్వితీయ బాగంలో 253, 254, 255 పేజీ లలో వివరించడం… ఇదే విషయాన్ని వత్సవాయి రాయజగపతి వర్మ గారు రచించిన పెద్దాపుర సంస్థాన చరిత్రము లో ప్రస్తావించడం జరిగింది

“సాగి పోతమరాజు సత్యాఖ్యప్రెగ్గడ

గుండమదేవుడు గొబ్బూరి రాజు

మొదలయిన వారల ముఖ్యులౌ బంట్లు

————– నెనుబది  మీద

నెనిమిది వేలతో  నే తెంచి రపుడు “

శ్రీనాధ మహాకవి చాటు పద్యం

పలనాటి యుద్ధంలో పెద్దాపురం మూల పురుషుల పాత్ర స్వల్పమే అయినప్పటికీ… చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన యుద్ధంలో వారి పాత్ర ఉండటం వళ్ళ పెద్దాపురం మూల పురుషుల చారిత్రిక ప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవడానికి దోహదపడుతుంది

 

 

 

 

 

అలాగే ఈ  రామ విలాసంలో పెద్దాపురం సంస్థాన సంపాదకులైన వత్సవాయ చతుర్భుజ తిమ్మ జగపతి గారి కీర్తి జగద్విదితం అనే అంశాన్ని తెలియజేస్తూ ఒక పద్యం రచించడం జరిగింది

 

తిమ్మరాజ శిఖామణి తేజరిల్లె

నతని కీర్తి నటించు శీతాద్రిసేతు

మధ్య పృధ్వీశ్వరాస్థాన మంటపములు‘ – రామ విలాసము, అవతారిక, పు. 21.

 

ఆనాటి సుబేదారైన షేర్ మొహమ్మద్ ఖాన్ చతుర్బుజ తిమ్మ రాయ జగపతి బహద్దరు గారి యొక్క వీరోచిత కార్యాలను మెచ్చి ఒక కత్తి ని బహుమానం గా ఇచ్చాడన్న విషయం ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది

 

షేరు మొహమ్మదు క్షీతిప శేఖరుఁ డద్భుత శౌర్య ధైర్య దు
ర్వారుఁడు మెచ్చి పైడిఁయొఱవాల్దన కేల నొసంగు వేళ దై
త్యారిసమానమూర్తి తన హస్తము మీఁ దుగ నందె వార్దిగం
భీరుఁడు వత్సవాయికుల పేరయ తిమ్మనృపాలుడుఁన్నతిన్’ – పైది, పు. 23.

 

పెద్దాపురం సంస్థాన సంపాదకులైన వత్సవాయా తిమ్మజగపతి గారి కుమారులు రాయజగపతి1607 – 1646 పరిపాలించి పెద్దాపురం సంస్థానాన్ని పెంపు చేసిన విధానాన్ని వర్ణిస్తూ

పీఠికాపురి కిమ్మూరు బిక్కవోలు

తునియు గొఠ్ఠాము మొల్లేరు ఘనత నేలే

వత్సవయి తిమ్మభూపాల వరుని సుతుడు

రాజమాత్రుడె రాయపరాజశౌరి తుల్యా మాహాత్యము

 

 

పెద్దాపురం సంస్థానాన్ని 1649 – 1688  వరకూ సౌర్య పరాక్రమాలతో పరిపాలన చేసిన  రాయజగపతి సూర్యమాంబ దంపతుల పుత్రుడు వత్సవాయి సార్వభౌమ తిమ్మజగపతి గారి వీరత్వాన్ని వర్ణిస్తూ

దుగరాజు మొదలైన దొరలను భంగించి

విశ్వంభరుని యుద్ధ విరతు జేసే రామ విలాసము, పు. 29

 

 

ఈయన పూర్వికులు అనగా… ఏనుగు లక్ష్మణ కవి గారి ముత్తాత పైడిపాటి జలపాల మాత్యుడు గారి పాండిత్యాన్ని మెచ్చి పెద్దాపురం సంస్థానాధీశులు ఒక ఏనుగును బహుమతిగా ఇవ్వడం చేత వారికి ఏనుగు ఇంటిపేరుగా స్థిరపడింది… ఏనుగు లక్ష్మణ కవిగారి తాత పెద లచ్చన్న కవి ఇతనికే పెద లక్ష్మణకవి అని పేరు ఇతను ద్రౌపదీ పరిణయ ప్రబంధాన్ని రచించి పెద్దాపురం సంస్థానాన్ని 1649 నుండి 1688 వరకూ పరిపాలించిన సార్వభౌమ తిమ్మ జగపతి మహారాజు గారికి అంకితం ఇచ్చాడు

 

ఈ ద్రౌపదీ పరిణయము సురుచిర శబ్ద భావరస శుంభ దలంకృతి మాధురీ మనోహరమట –  రామ విలాసము పు 29 లోని పైపద్యం ద్వారా తెలుస్తుంది

 

అలానే తుల్యామహాత్యము రచించి వత్సవాయి వంశస్థులకు రాజా బంధువులైన వత్సవాయి కస్తూరి రంగ శౌరి కుమారులు వత్సవాయ జగన్నాధ రాజుగారికి మరియు దృవచరిత్రము రచించి వత్సవాయ జగ్గరాజుకీ అంకితం ఇచ్చారు

 

 

ఏనుగు లక్ష్మణ కవిగారి తండ్రి తిమ్మకవి. తల్లి పేరమాంబ,   అన్నయ్య అనంత కవి ( సరస కవితా ప్రవీణ బిరుదాంకితుడు – గౌరీ పరిణయం ప్రబంధ కర్త )

 

హేమ నాగేంద్ర ధీరుడగు నేనుఁగు లక్ష్మణ సత్కవీంద్రుడు

ద్దామ సుధామయోక్తి వితతంబగునట్లు రచించినట్టి తు

ల్యామహిమ ప్రబంధము గుణాఢ్యులు మెచ్చ బరిగ్రహించె బ్ర

జ్ణామహితుండు జగ్గనృపచంద్రుడు శాశ్వతకీర్తి సంధిలన్ – రామవిలాసము పు. 94

 

శోభితాప స్థంబ సూత్రు వాధూలస

గోత్ర పవిత్రు సద్గుణ సమేతు

నేనుఁగు గరకమంత్రీంద్రుని పౌత్రుని

వెణుతరుబలి వేంకటాద్రి

దౌహిత్రు విశ్వనాధ కవి మేనల్లుని

పేరెన్నికైనట్టి పేరమాంబ

కును గుర్వమంత్రికి నేనరగు బుత్రుని

లక్ష్మణజ్ణుండగు లచ్చ మంత్రి

నచ్చణాఖ్యుని బిలిపించి యగ్రభాగ

మునను గూర్చుండ నియమించి ముదముగదుర

భుజముపై జేయి చేర్చి సభ్యులు వినంగ

నెంతయును గారవింపుచు….  

భూదేవికి ఆదిశేషుడు దెలిపిన తుల్యభాగా మహాత్యమును తెలుగుసేయుమని కోరగా నానావధాననిదియును, సంగీతకళా మహోదధియును అగు లచ్చన కవి దీనిని రచించి నట్లుగా తెలియుచున్నది

 

లక్ష్మీషుని పేరా పదకవిత్వము వినకరి చేసినవాడట లచ్చన్న కవి

వెంకటక్షితిపతి పుత్రుడగు వత్సవాయ జగ్గభూవరుడు

 

సాహస విక్రమార్కుడని సర్వ నృపాలురు బ్రస్తుతింప ను

త్సాహము భూని కార్యములు చక్కగ దిద్ది నిజాము చేత స

ద్వాహన భూషణాంబర సువస్తుతతుల్ బహుమానమంది… నవాడు

 

వత్సవాయి తిమ్మ భూపతికి కుడిభుజముగా వర్తించినవాడు ఈ జగ్గనృపాలుడే

కవికుల సార్వ భౌముడనగా దగు నేనుఁగు లక్ష్మణార్యుచే

ద్రువచరితప్రబంధము బుధుల్వినుతింపగ నంది భోగభు

గ్భవన మహా సుఖానుభవకారణమైన యశంబుగాంచి… నవాడు  – రామవిలాసము 50, 51 పుటలు  

 

 

 

ఏనుగు లక్ష్మణకవి పెద్దాపురం సంస్థానమును (1688-1714) పరిపాలించిన  ఉద్దండరాయ జగపతి ని గూర్చి రామ విలాసం పుట 32 లో “సూరి దారిధ్యాంధ కారంబునకు ధనవితరణం బినకర ప్రతతి గాగ అని ప్రస్తుతించనాడు అలాగే ఉద్దండ రాయ జగపతి పెద్దకుమారుడైన కళాతిమ్మ జగపతి ధీరులు సన్నుతింప బహుదేశలిపుల్ బహుదేశభాషలున్ సారకవిత్వ సౌష్ఠవ రసజ్ఞత యున్ దన సూక్ష్మ బుద్ధిచే నెరిచె … అని పైది పుట 35 లో ప్రస్తుతించ బడినాడు నట ఈ తిమ్మనరనాధుని సన్నిధినున్న సజ్జనులందరును … భవ్యకావ్యవిదులై నుతికెక్కి రట కళాతిమ్మ జగపతి తమ్ముడగు సూరనృపాలుడు గుణవద్విజ సంతతికెల్ల గొంగు బంగారము అని పైది పుట సంఖ్య 36 లో   కొనియాడబడ్డాడు

 

 

 

 

వెంకట సింహాద్రి రాజు గారికి అంకితం ఇవ్వబడిన కువలయామోదం అనే అలంకారిక గ్రంధం నందు పెద్దాపురం ప్రభువుల పండితపోషణ ఈవిధంగా వర్ణించబడినది.

శ్రీ రత్నాకర మేఖలావలయిత భ్రాజన్మహీమండలీ
నానా స్థాన సరోరు నాయక మహా రత్నం సముల్లాషితం
శ్రీ పెద్దాపుర భావ్యనామక మహాసంస్థాన మాసిర్భుధై
శ్లాఘ్యం సత్కవి మండలైర్విలసితమ్ సంసేవితమ్ రాజభిఁ

 

విజయ నగర మహారాజు శ్రీ విజయరామరాజు గారు వత్సవాయి చతుర్బుజ తిమ్మరాయ జగపతి బహద్దరు గారి వీరత్వాన్ని వర్ణిస్తూ రచించిన చాటువు

ఆంభోజం కలయం సదృక్ష మవనే సాహిత్యరీత్యామ్ దృశో
ర్మాంధా తార మపార సంపది మహా బావే యశో రాశిషు
శత్రూణాం పురభంజనే దృతి గుణేకిం చోరగేంద్రంమతి
ప్రాగాల్భ్యే ప్రతిధాతి తిమ్మ నృపతిః పాకాహిత ప్రాభవః విజయరామరాజు చాటువు

 

పెద్దాపురం సంస్థానాన్ని తురుష్కుల బారినుండి తప్పించి కళాతిమ్మజగపతి మహారాజు కుమారుడైన రాయ జగపతి కి కట్టబెట్టేందుకు విజయనగర మహారాజు పూసపాటి విజయరామరాజు అనేక ప్రయత్నాలు చేశారు దానిలో భాగంగా చేబ్రోలు వద్ద జరిగిన యుద్ధంలో నూరుద్దీన్ ఖాన్ ను ఓడించి తల తెగనరికి పెద్దాపురం సంస్థానాన్ని రాయ జగపతి కి అప్పజెప్పారు ఆ విషయాన్ని వర్ణిస్తూ  దేవులపల్లి రామశాస్త్రి  గారు చెప్పిన చాటుపద్యం

 

||||మహి నానంద నృపాలు శ్రీ విజయరామస్వామి వాల్‌సోకి నూ

ర్ద్రిహుసేన్‌ఖానుని మస్తికం బసిమొనన్‌ రెండయ్యె, రెండయ్యె భ

వ్య హరిద్ఘోటక మండలం బపుడు, రంభాకంచుక గ్రంథియున్‌

రహి రెండయ్యెజనానులాపమునకు దప్పేది వ్రేటాఱన్‌ @

 

 

పెద్దాపురం సంస్థానాన్ని 1649 నుండి 1688 వరకూ పరిపాలించిన సార్వభౌమ తిమ్మజగపతి మహారాజు గారికి సంతానం లేనందున అతని తమ్ముడు బలభద్ర రాజ జగపతి వెంకాంబ దంపతుల కుమారుడు ఉద్దండ రాయ జగపతి 1688 – 1714 వరకూ పరిపాలన చేశారు వీరి వీరత్వాన్ని వర్ణిస్తూ ఒక చాటు పద్యం

 

 ఘనరాజ మండల నిరోధము చేసిన జాఫరళ్లి వింధ్యగిరిని నామశేష మగునట్టుగ పైది. పు . 

 

చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు గారి ఆస్థాన పౌరాణికుడైన బులుసు రామ గోవింద శాస్త్రి ప్రత్యక్ష బాహాట పాంకాల శయ్యల జదివింప నేర్తు నే జదువనేర్తు అని ప్రకటించుకున్న వాడు ఇతను పెద్దాపురం సంస్థానంలోని పలివెల గ్రామ నివాసి హరిభక్తి సుధోదయం అనే మహాకృతి రచించి  1607 నుండి 1647 వరకూ పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించిన వత్సవాయి రాయ జగపతి మహారాజు గారికి అంకితం ఇవ్వడం జరిగింది అని రామవిలాసము లోని అవతారిక పుట సంఖ్య 25 ద్వారా తెలియుచున్నది

 

ప్రస్తవ్యమగు హరిభక్తి సుధోదయంబను మహాకృతి రత్నమందునియె”

 

 

సార్వభౌమ తిమ్మరాజుగారి సోదరుడైన బలబద్ర జగపతికి పాండిత్యం మీద మంచి పట్టు ఉండటమే కాక శ్రీ రాముడి పై వంద పద్యాలు రచించడం జరిగిందనీ కితార్జునీయం అనే కృతి వీరికి అంకితం చేయబడినది అని రామ విలాసం లోని ఈ పద్యం ద్వారా తెలియుచున్నది

 

అమిత ఖ్యాతికి మూలమైన కృతి దానందెన్ గిరాతార్జునీ

యము: శ్రీరాముల పేర బద్యశతకం దారూఢి నిర్మించె భో

జ మహీజాని గతిన్ బ్రసిద్ధి గనియెన్ సాహిత్య సారాజ్ఞుడై

రమణన్ శ్రీ బలభద్రరాజు ప్రజలన్ రక్షించె ధర్మస్థితిన్‘  – పు 31

 

 

తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పకోదగ్గ కవుల్లో అడిదము సూరకవి కూడా ఒకరు ఈ యన విజయనగరం పూసపాటి వారి ఆస్థాన కవి అని కొన్ని చారిత్రిక గ్రంధాల ద్వారా తెలుసుకోవచ్చు పెద్దాపురం ఆస్థానంలో ఆడిదం సూరకవి చెప్పిన సుప్రసిద్ధ చాటువు –

||||   రాజు కళంకమూర్తి, రతిరాజు అంగవిహీనుఁ డంబికా
రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతరసీమవర్తి, వి
భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాఁలుడె రాజు గాక, యీ
రాజులు రాజులె పెనుతరాజులు గాక ధరాతలంబునన్.  

 

 

పెద్దాపురం సంస్థానాధీశుడైన వత్సవాయ తెలుంగాదీశుని దాన గుణ పండిత పోషణనము గురుంచి వేములవాడ భీమకవి స్వయంగా చెప్పిన చాటు పద్యంగా ప్రసిద్ధిచెందినది

|||| 

ఆరయ వత్సవాయ తెలగాధిపానందన నారసింహ ! మీ

ద్వారము గర్హితాహితవిదారము సత్కవి బంధురక్షణో

దారము సత్యశౌచనయ ధర్మవిచారము కామలోభివి

స్తార నివారము సదుపచారము దైన్య నివార మారగ – @చాటుపద్య మణిమంజరి – వేటూరి ప్రభాకర శాస్త్రి

 

 

ఒకనాడొక పేద పండితుడు వత్సవాయి వారి అనుగ్రహం కోసం పెద్దాపురం సంస్థానం వచ్చి వత్సవాయి మహారాజుల శరణుకోరితే పేదరికం మటుమాయం అయిపోతుందని దారిద్ర్యదేవత కూడా ఏమీ చేయలేదనే అర్ధంతో చెప్పిన చాటు పద్యం

|||| తేవకు తోడ వత్సవయ తిమ్మజగత్పతి ప్రాపు చేరితిన్

రాకు దరిద్ర్యమా ఇక బరాకునైన గిరాకునైన నీ

పోకలు సాగవింక జెడిపోవక మా పగవాని జేరుమా

దీకొని వచ్చితేని నిను దిట్టక కొట్టక మాన నిమ్మహిన్

 

 

మాగాపు శరభకవి గారు ఒకరోజు రాజా వత్సవాయ తిమ్మజగపతి మహారాజు గారిని కలవడానికి పెద్దాపురం వచ్చారట ఆ సమయంలో మహారాజా వారు మంత్రి దండనాథాగ్రణులు మరియు సైనిక సంపత్తి ఆస్థాన పండితులతో ముఖ్యమైన చర్చలో ఉన్నారట చాలా సేపటి తర్వాత ద్వారపాలకులు ద్వారా విషయం తెలుసుకున్న మహారాజు గారు శరభకవి గారిని లోపలికి రప్పించమని పిలిచారట, అప్పటికే శరభకవి పేరు రాజ్యమంతా మారు మోగి పోయి ఉండటం వల్ల శరభ కవి గారి ఆకారాన్ని అలంకారాన్ని చాలా ఎక్కువగా ఊహించుకున్న మహా రాజు గారు అంగవస్త్రమును కట్టుకుని భుజము మీద ఒక గామంచా, చంకలో సంచి, చేతిలో తాటియాకు పుస్తకములకట్ట మాత్రము కలిగి యుండి, బీద బ్రాహ్మణ వేషముతో ఉన్న శరభకవి ఆకారం చూసి వెంటనే ఇతడా శరభకవి అని అందరి ముందు అనేశారట. “అంతే మహా రాజు గారి ఏక వచన ప్రయోగానికి కోపగించుకున్న శరభ కవి

||||ఇతడా రంగదభంగ సంగర చమూహేతిచ్ఛటాపాలకో

ద్ధ్తకీలాశలభాయమానరిపురాడ్ధారాశ్రు ధారానవీ

తరంగిణ్యబలాఅమాగమసమా నందత్పయోధిస్తుతా

యతశౌర్యోజ్వలుడైన వత్సవయ తిమ్మక్షావరుం డీతడా @మాగాపు శరభకవి

అంటూ మొదలు పెట్టి 60 సార్లు ఏక వచన ప్రయోగం చేసాడట – అయినప్పటికీ పండిత ప్రియుడైన మహారాజు శరభ కవికి కనకాభి షేకం చేయించి మాగాం అనే అగ్రహారాన్ని దానం గా ఇచ్చి పంపించాడాట

పెద్దాపురం సంస్థానమును పరిపాలించిన వత్సవాయి తెలుంగాదీశుని తండ్రి వత్సవాయి రామరాజుపై ఒకచాటు పద్యం

|||| రాచర్క మనగ జందెంపు

బోచా మఱి రిపుల గల్చి భూనుతకీర్తి

యాచకులు కీయగల్గుటే

రాచర్కము వత్సవాయ రామనృపాలా

 

 

ఈ కళాతిమ్మ జగపతి కుమారుడైన రాయజగపతి మంచి రామ భక్తులు ఈయన భద్రాద్రి రాములవారిపై కీర్తనలు రచించి రాములవారికే అంకితం ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్న పద్యం

పదములు గీర్తనల్ రుచిర పద్యశతంబులు రాగమాలికా

మృదుషదందబులు సమిద్ద్గతి ంరచియించి కామిత

ప్రభునకు భద్రశైలప్రభుభర్తకు గానుకగా నొసంగెనే

ఆశ్రితులు మెచ్చ దా జగపతిప్రభుచంద్రుడు భక్తిపెంపునన్

వత్సవాయి జగపతి మహారాజు భద్రాద్రి రాముడి పై వ్రాసినట్లుగా చెప్పబడుతున్న పద్యం

 

రాయజగపతి కుమారుడైన విద్వత్తిమ్మ జగపతి మహారాజు 1760 – 1797 వరకూ పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించారు రామవిలాసములోని పుట సంఖ్య 40 లో అతనిని విద్యావిత్తంబుల రాసి అని అభివర్ణించగా పైది పుట సంఖ్య 40  సిరిగందమున డావి వీరివి నొందిన ఠీవి… వత్సవయ తిమ్మభూపాల వరుని యందు బంధితాశ్రిత వరకవి పక్షపాతగుణము సహజ…. మని” తెలియజేయుచున్నది

 

 

 

“ఆయత వత్సవాయ సుకులాంబుధి పూర్ణనిశాపతీ ! జగ
జగద్గేయశుభాకృతీ ! విధితకీర్తిసతీకమనీ యయౌవన
ప్రాయలాకృతీ ! సతతవై భవనిర్జిత పూర్వదికృతీ !
దీయుత వాక్సతీ ! జగపతీ ! నృపతీ ! సుకృతీ ! మహోన్నతీ ! ”  @చాటుపద్య రత్నాకరము – దీపాల పిచ్చయ్య శాస్త్రి

 

@ ఏనుగు లక్ష్మణకవి

 

 

 ||క||డాబాలో గూర్చున్నా

డే బాలుడు ఎవ్వరి చెపుమా

చాబాషూ నీవదిరెంగువే

బాబాజీ బుచ్చితిమ్మ బహద్దరె చెలియా

 

 

 

పెద్దాపురం సంస్థాన చరిత్రము పుస్తకము ప్రకారం గోదావరి మండలము లోని చాలా భాగము,

కృష్ణా గుంటూరు మండలాలలోని కొంత భాగము, పెద్దాపురం సంస్థానం అధీనంలో ఉండేవి గా తెలుస్తుంది కృష్ణా మండలం పెదకళ్లేపల్లి వాస్తవ్యులైన శ్రీ సుసర్ల బ్రహ్మన్న శాస్త్రిగారు పెద్దాపురం సంస్థాన ప్రభువైన వత్సవాయి తిమ్మ జగపతి పై ఒక చాటుపద్యం వ్రాసినట్టు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చాటుపద్య మణిమంజరి నుండి తెలియుచున్నది

 

శ్లో || క్షేత్రం దాశరధి: ఖిలం నిజపదస్సర్షేణ దోషోజ్ఘితం

తర్కజ్ఞస్య హి గౌతమీ తటజుషో విప్రస్య స వ్రత్యదాత్

గోదాసప్తక తీర సంస్థితి జుషాం షడ్డర్శనీదర్శనాం 

శ్రీ తిమ్మ క్షితిపో Xఖిలం తదకర స్పర్శం విధ త్తేXదునా

 

శ్లో || తద్ధిత స్తద్ధిత స్త్వద్ధిత స్త్వద్ధిత

      సద్ధిత స్సద్ధితో మద్ధితో మద్దితః

      ఏక ఏవ హ్యాసౌ తిమ్మ రాజప్రభు 

      స్తద్ధిత స్త్వద్ధిత స్సద్ధితో మద్దితః

—————————————————–

 

వక్కలంక వీరభద్రకవి

సీ||

అతడు రాజకిరీటు డఖిల రాజకిరీట

ఘటితపదాబ్జ సంగతులు మీరు

అతడు వారణ దూరు వారణ రాజ

గణసమాకులపు రాంగణులు మీరు

అతడాది భిక్షుడు తతభి క్షు కానీక

యాచితార్ధ ప్రదాయకులు మీరు

అతడు సర్వజ్ఞు  డంచింతనైక సర్వజ్ఞ

పూజనీయసమ స్తబుధులు మీరు

 

గీ||

భళిర మీతోటి సాటి కేపాటి మేటి

సర్వలోకేశ్వరుం ( డన జనెడు శివుడు)

వత్సవాయ జగత్పతీశ్వర తనూజ:

ఘనసు గుణసాంద్ర: జగపతిక్ష్మాతలేంద్ర:

 

సీ ||

అంబుజం బిల్లుగా హర్షించుపువుబోణీ

ధరాజగజ్జఠర నిర్భరవటుహరి

హార శేషచ్చాయ యౌకఠోర శ్రేణి (;)

ధర శాఙ్గదరు బొడ్డు దనరుకొడుకు

భూరి సింహము గుఱ్ఱముగ రూఢి గలచేడే

దక్షమఘ క్షయౌ ద్ధత్య బలుడు

రథ గజ తుర గ భద్ర జయా యు రక్షతా

 

గీ||

సంతతోత్సవ శాలివై జగతి ఠేవ

నలరు మిల వక్కలంక వీరయను బ్రోవు

వత్సవయరాయ జగపతీశ్వర తనూజ

రాయజగపతి రాజ: గోత్రాబిడౌజ :

 

 

తురగారామకవి

||క||  అద్దిర శ్రీ భూనీలలు

మద్దియ లా హరికి గలరు ముగురమ్మలలో

పెద్దమ్మ నాట్యమాడును

దిద్దిమ్మని వత్సవాయి తిమ్మన ఇంటన్.

 

 

ఆంధ్ర రచయిత అయిన అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి గారు 1831 – 1892 కాట్రావులపల్లి నూతులపై నొక పద్యము చెప్పెను.

||క|| దేవాసురు లబ్ధిదరువ
నావిర్భూతమయి హాలహల మపుడు మహా
దేవునకున్ భీతిలి కా
ట్రావులపలి నూతులందు డాగెంజుండీ

 

 

 

 

నీలాద్రిరాజుగారు పెద్దాపురము రాజ్యమును బరిపాలించిన శ్రీ రాజా వత్సవాయి వేంకటసింహాద్రి జగత్పతీంద్రుని యాదరమున దుని సంస్థాన కవిగానుండి పేరందెను. తునిరాణి శ్రీ సుభద్రాంబిక యీకవిని బహుగౌరవముతో జూచినది. నేటి తునిరాజుగారు శ్రీ వత్సవాయి వేంకటసూర్యనారాయణ జగపతిరాజావారి పట్టాభిషేక సందర్భమున బ్రదర్శనము చేయుటకై కవిరాజుగారు శాకుంతల మాంధ్రీకరించినటులు ప్రస్తావనలో నున్నది. శ్రీవారి సంస్థానమున నీయన జేగీయమానముగ శతావధానము గావించెను. ఆంధ్రభారతీ తీర్థవారు ‘కవిభూషణ’ యను బిరుదముతో నీయనను సత్కరించిరి. కవిరాజుగారు తాను శతావధాని నన్న సంగతి యీపద్యములలో బేరుకొనెను.

||క|| పంకేజభావవధూపద పంకజ

మంజీరనినద భాసురములు నీ

పొంకపు పలుకులు మీర్ జా

వెంకటనీలాద్రిరాజ విద్యలభోజ

 

|||| తీరుగ వత్సవాయ కుల తిమ్మ జగత్పతికీర్తి హార మా

హారశరద్ద్విజన్మకులిశాయుధ జాతుల మించె శౌర్యమా

హారశరద్ద్విజన్మకులిశాయుధ జాతుల మించె రూపమా

హారశరద్ద్విజన్మకులిశాయుధ జాతుల మించె నిర్ధరన్

 

|||| రాజులరాజు లోభి యొక రాజులారా జతి మూర్ఖుడష్టది

గ్రాజుల రాజు చోరుడు విరాజులరా జొక పక్షి తారకా

రాజులరాజు దోషి ఫణిరాజులరా జొక వక్రగామి యీ

రాజులు రాజులా సుగుణ రాజుల రాజవు నీవుగాక యో

రాజవతంసః వత్సవయ రాజమహీపతి తిమ్మభూపతీ:   @ చల్లా వెంకయ్య కవి

 

 

 

జన్నమాంబ – వేములవాడ భీమకవి

జన్నమాంబకు వ్రణవిముక్తి చెయదలచి చెప్ప్న పద్యములు

                  ఘనరోగంబుల బలమా

                   కనుగొనగా జన్నమాంబ కర్మపుఫలమా!

                   నినుఁ బ్రార్థించెద వినుమా

                   మునుకొని యోగండమాల మునగకుఁజనుమా

భావము: జన్నమాంబ కర్మల ఫలితంగా ఆమెను పట్టి పీడిస్తున్న అన్ని రోగముల కంటే బలమైన ఓ గండమాల(గొంతును పట్టి పీడించు క్యాన్సర్)! నిన్ను ప్రార్థిస్తునాను, తక్షణమే ఈమెను వదిలి ఆ మునగ చెట్టును ఆవహించుము!

చేసిన సహాయమును మరచినదైన జన్నమాంబకు బుద్ధి చెబుతూ తిరిగి వ్రణమును ఆమె కంఠమును ఆవహించమని చెబుతూ చెప్పిన పద్యములు

          ఆవె     మున్ను జన్నమాంబ మునుకొని యుంటివి

                    యేను బొమ్మటన్న యీవుజన్న

                    ముండ యేరుగడచి ముదిపెండ్లికతసేసె

                    మునగగండమాల ముండఁబట్టు

భావము: ఓ గండమాలా! మొదట జన్నమాంబను పట్టి పీడిస్తుంటివి. నేను పొమ్మన్న తర్వాత నువ్వు మునగచెట్టుకు అంటుకున్నావు. కష్టాలు తొలగిన తర్వాత ఈ విధవ ” ఏరు దాటించేదాకా నిన్నే పెళ్లి చేసుకుంటానని, తీరా గండం గడిచిన తరువాత – ముసలాడివి నిన్నెవరు చేసుకుంటారు?” అన్న శాస్త్రం ప్రకారం చేసిన ఉపకారము మరచిపోయి ప్రవర్తిస్తోంది. కావున ఈ విధవను మళ్ళీ ఆవహించు.

          ఆవె     ఏను భీమకవిని యిదె నిన్ను ప్ర్రార్థింతు

                    మునుపు నీవువచ్చి ముండఁబట్టి

                    మునగకొండయయ్యె మునుపటిరీతిని

                    మునగ గండమాల ముండఁబట్టు

భావము: ఓ మునగ గండమాలా! నేను భీమకవిని ఇదే నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు శీఘ్రంగా వచ్చి మునుపటిలాగా లాగా విధవను చేరుము.

 

 

భీమకవి – పోతురాజు

                                హయమది సీత; పోతవసుధాధిపు డారయ రావణుండు; ని 

                                శ్చయముగ నేను రాఘవుడ; సహ్యజవారధి; మారుఁడంజనీ 

                                ప్రియతనయుండు; లచ్చన విభీషణుఁ డీ గుడిమెట్ట లంక; నా 

                                జయమును బోతరక్కసుని చావును నేడవనాడు చూడుడీ.   

 

భావము: గుఱ్ఱము సీత వంటిది. అపహరించిన పోతురాజు రావణుడు. నేను ఖచ్చితముగా రాముడిని. ఈ కృష్ణానది సముద్రము. గుఱ్ఱము ఆచూకీ తెలిపిన రాహుతీమారడు అంజనీ ప్రియతనయుడైన హనుమంతుడు. తనకు రాయబారము నడిపిన పోతురాజు తమ్ముడు లక్ష్మీగజపతిరాజు విభీషణుడు. ఈ గుడిమెట్ట లంక. నా గెలుపును, పోతురక్కసుని చావును ఏడవ రోజున చూడండీ.

 

గుడిమెట్ట ప్రాంతములో భీమకవి దేశయాటనము చేయు గుఱ్ఱాన్ని పోతురాజు  అపహరించగా ఆ విషయాన్ని రాజుతీమారుడను అతని నుంచి ఈ విషయం చెపుసుకొని, పోతురాజు లచ్చనతో తన గుర్రమును ఇప్పించమని పోతురాజుని హెచ్చరిస్తూ కబురు పంపినా కూడా, లెక్కచేయకపోగా తన పట్లనే ఇలా ప్రవర్తిస్తే ఇక ప్రజల సుఖక్షేమాలను ఏవిధంగా చూసుకుంటాడని ఇటువంటి వాడు పాలకుడిగా అనర్హుడని భావించి అతని తప్పును సరిదిద్దుకోవడానికి 7 రోజుల గడువు విధిస్తూ రామాయణ వృత్తాంతముతో పోల్చి చెప్పిన పద్యము.

 

తెలుంగ రాయుడు

 

పెద్దాపురాన్ని పాలించే తెలుంగరాయుడను రాజునకు ఎప్పటి నుంచో భీమకవిని తన రాజ్యమునకు పిలిపించుకోవాలని ఎంతో ఆశ ఉండేది. ఉద్దండకవి, మహానుభావుడు అయిన భీమకవి తన రాజ్యమున ఉంటే ఎల్లప్పుడూ విజయైశ్వర్యములతో తన రాజ్యము తులతూగుతుందని భావించేవాడు.  ఇదిలా ఉండగా ఒకసారి భీమకవి పెద్దాపురం వెళ్ళారు. తానే స్వయంగా తెలుంగరాయుడి ఆస్థానమునకు వెళ్ళి కస్తూరి, పచ్చకర్పూరము జవ్వది సుగంధవస్తువులను బహుమతిగా ఇచ్చి తన అనుగ్రహమును పొందమని చెబుతూ ఈ క్రింది పద్యమును చెప్పారు.

 

మ      ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామభీమేశ నం

దనుడన్ దివ్యవిషామృతప్రకట నానా కావ్యధుర్యుండ భీ

మన నా నామమెరుంగ జెప్పితిఁ దెలుంగాధీశ! కస్తూరికా ఘన

సారాది సుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.

 

భావము: గొప్పవాణ్ణి, వేములవాడ వంశస్థుడను,  ద్రాక్షారామభీమేశ్వరుని కుమారున్ని, విషము, అమృతం రెంటిని అమోఘమైన నా పలుకుల్లో కురిపించగలవాడను, ఎన్నో ఉద్దండ కావ్యాలను రాసినవాడను. భీమన నాపేరు. తెలుసుకుంటావని చెప్తున్నాను. కస్తూరి, పచ్చకర్పూరం మొదలగు సుగంధద్రవ్యాలను త్వరగా ఇచ్చి బుజ్జగించరా!

 

గొల్లభామ కథ

 

ఒకరోజు ఓ యువతి అత్యంతవిలాసంగా, ఒయ్యారంగా నడుస్తూ, నెత్తిన కుండలోని మజ్జిగ చల్లిపోయేలా చేతులు ఊపుతూ, “మజ్జిగోయమ్మ మజ్జిగ” అని అరుస్తూ నడుస్తోంది. ఈమె వయ్యారమును చూసి కొందరు ఆమె ఎంత ధర చెప్పినా, బేరమాడక కొనేవారు కొందరు. అవసరము లేకున్నా ఆమెతో మాట్లాడాలన్న నెపంతో కొనేవారు ఇంకొదరు. కొనకున్నా ఆమెతో కాసేపు బేరమాడి కాలయాపన చేసేవారు మరికొందరు. ఒకనాడు మేడపై భీమకవితో మాట్లాడుతూ ఆమెను చూసి తెలుంగరాయుడు “కవివర్యా! చూసారా ఆ యువతి నెత్తిపై నుంచి మజ్జిగ చల్లిపోతున్నా పట్టించుకోకుండా ఎంత విలాసంగా నడుస్తోందో. ఎంత నిర్లక్ష్యం లేకపోతే” అన్నాడు. అందుకు భీమకవి మహారాజా! ఆమె విలాసవతి అని ఆమె వేషము, నడకలే చెబుతున్నాయి ఆమె దుశ్చరితను” అన్నారు. రాజు “ఆమె ఎవరు? మీకు ఆమె నడవడి గురించి నీకెలా తెలుసు” అని అడుగగా, భీమకవి “ కవిగాంచు రవి చూడగా లేని యర్థంబు. అగతానాగత వివేకియు, నిరంతర సత్యాన్వేషణాపరుడనగు కవీశ్వరుడను నేను. నాకు తెలియనిది ఉంటుందా? ఆమెను చూసిన వెంటనే ఆమె చరిత్ర అంతా నా కళ్ళకు కనపడింది” అని చెప్పారు. ఆమె ఉదంతమంతా వివరించమని తెలుంగరాయుడు అడుగాడు, భీమకవి ఆమె మనసులోని భావాన్ని, ఆమె మాటల్లో చెబుతూ, ఈ క్రింది పద్యమును చెప్పారు.

 

ఉ      భూపతిఁజంపితిన్ మగడు భూరిభుజంగము చేతఁ జావగా

నాపద జెంది జెంది యుదయార్కునిపట్ణముఁ  జేరి వేశ్యనై

పాపముఁగట్టుకొంటి సుతుఁబట్టి బొజుంగని జెట్టవట్టి సం

తాపముఁజెంది యగ్ని బడ దగ్ధముగాకిటు గొల్లభామనై

యీవని కోర్చు కొంటి నృపతీ! వగపేటికిఁ జల్ల చిందినన్

 

భావము: మహారాజును చంపాను. భర్త పాము కాటుకు మరణించడముతో ఆపదల పాలై ఉదయార్కునిపట్టణమును చేరి వేశ్యనై పాపము కట్టుకున్నాను. కొడుకు నను మోహించగా ఆ బాధతో అగ్నిలో దూకాను. అగ్ని దేవుడు కూడా తనను దహించకపోవడంతో ఇక్కడకు వచ్చి గొల్లభామనై విలాసావతినై మజ్జిగ చిందించుకుంటూ బ్రతుకుతున్నను మహారాజా!

 

తెలుంగరాయుడు ఆసక్తితో ఆ యువతిని పిలిపించి “నీ కథ ఏమి? ఎవరు నువ్వు? ఇలా మజ్జిగ చల్లవేసుకుంటూ వయ్యరముగా నడుస్తున్నావు? నిజం చెప్తావా లేదా? ” అని గద్దించి అడిగే సరికి ఆమె తన పూర్వచరిత్రను ఇలా చెప్పింది.

“ధాన్యకటకనగరము సమీపాన ఉన్న ఆనందపురమును ఆనందుడనే రాజు పరిపాలించేవాడు. ఆ పట్టణమంలో దంతవిశ్రుతుడను బ్రహ్మణుడి భర్యను నేను. నా భర్త ఎప్పుడూ వైదికాచారాలలో మునిగిపోయి నా సంతోషాన్ని పట్టించుకోకపోవడముతో నాకు అతడు సరికాడని భూపతితో స్నేహమును చేసి అతనితో సంతోషంగా గడిపేదాన్ని. నా భర్త దంతవిశ్రుతుడు ఎప్పుడూ పెళ్ళీపేరంటాలు చేయిస్తూ ఊళ్ళు తిరుగుతూ ఉండడం వలన నా స్వేచ్ఛకెప్పుడూ ఆటంకము కలుగలేదు. ఒకసారి అతడు ఆకస్మికంగా ఇంటికి వచ్చినపుడు భూపతి, నేను ఆయన కంటపడ్డాము. నాటి నుంచి నన్ను ప్రేమతో చూడక దూషించడం మొదలుపెట్టాడు. రానురాను అతనిని భరించడము చేతకాలేదు. భర్త దంతవిశ్రుతుని చంపితే కాని తాను భూపతితో సుఖంగా ఉండలేనని, అతని కోసం చేసిన ఫలహారములో విషం కలిపి ఉంచి నా పనిలో నిమగ్నయ్యాను. ఇంతలో ఆనందుడు(భూపతి) వచ్చి పళ్ళెములో ఉన్న ఆ ఫలహారాన్ని చూసి తన కోసమే తయారు చేసి ఉంచాననుకొని తినేసాడు. అంతలో నా భర్త రావడం గమనించి, అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి తెల్లరింటిలోపు ఆనందుడు మరణించాడు. కొంతకాలము దుఃఖించిన తర్వాత మంత్రి కుమారుడగు విలాసుడిని పట్టాను. ఒకనాడు ఇంటికి వస్తూ భర్త పాముకాటుతో మరణించాడు. ఇక నాకు ఏ అడ్డూలేకపోవడంతో  విలాసునితో అత్యంత సుఖముగా గడిపాను. ఆ ఫలితంగా గర్భమును దాల్చి కుమారున్ని కన్నాను. లోకము తప్పుగా చూస్తుందని ఆ కుమారుని ఊరి బయట ఉన్న అరణ్యములో ఒక పాతబావిలో పారవేసి వచ్చాను. ఉదయార్కపురమును పాలించు ఉదయార్కుడు వేటకై అక్కడకు వచ్చాడు. నీటి కోసం బావి దగ్గరకు వెళ్ళినపుడు ఏడుస్తున్న బాలుడిని చూశాడు. తనకు సంతానం లేకపోవడము వలన భగవంతుడు ఇచ్చిన బిడ్డగా భావించి దేవదత్తుడు అని నామకరణం చేసి కడుగారాభముగా పెంచాడు. పెరిగి పెద్దయ్యాక ఆ బాలుడికి పట్టాభిషేకం చేసి తాను తపోవనముకు వెళ్ళాడు.

ఇక నా సంగతికి వస్తే కొంత కాలానికి విలాసుడికి ఆత్మబోధ కలిగి నన్ను వదిలివేసాడు. ఇంటికి రావడము కూడా మానేసాడు. పోశించేవారు కరువై, ఉన్న వస్తువులను  అమ్మివేసి ఆ డబ్బుతో కొంతకాలము గడిపాను. తరువాత ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి వచ్చింది. కానీ ఏపని చేయలేక వేశ్యగా మారి ఉదయార్కపురము చేరాను. నా కుమారుడు దేవదత్తుడు రాజ్యమేలుతూ నన్నే మోహించాడు. చూడగామే అతన్ని నా కుమారుడేనని గ్రహించాను. ఎంతో బాధపడ్డాను. ఇక నేను బ్రతికుండి ప్రయోజనము లేదనిపించి అగ్నిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసాను. ఆ అగ్నిదేవుడు కూడా నన్ను తాకుటకు ఇష్టపడక వదిలేసాడు. ఇక గత్యంతరము లేక ఆ ఊరు వదిలి ఇక్కడకు వచ్చి గొల్లభామనై, నానా అవస్థలు పడుతూ, జీవితము గడుపుతున్నాను. నేను చాలా పాపాత్మురాలను, కానీ దైవాంశసంభూతుడగు భీమకవి దర్శనభాగ్యము వలన నాకు  పాపముల నుంచి నిష్కృతి లభించునని తలుస్తున్నాను.” అని పలికింది. రాజు ఆమె మాటలు వినగానే భీమకవిని భూత,భవిష్యత్,వర్తమాములను తెలిసిన దైవాత్ములని కీర్తించాడు. ఆమె తన కంఠస్వరముతో భీమకవి రచించినపై పద్యాన్నే మరల చెప్పి, ఆయన పాదాలపై వాలి పశ్చాత్తము చెందింది. భీమకవి “ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. ఎప్పుడైతే చేసిన తప్పులను తెలుసుకొని, వాటి నిష్కృతికై పరితపిస్తూ, నా పాదాల వాలావో ఆ క్షణానే నువ్వు పవిత్రురాలివయ్యావు. ఇకనుంచైనా చక్కగా బ్రతుకుము” అని చెప్పి ఆశీర్వదించారు. తగిన ఉపాధి కోసము ఆమెకు రాజు నుంచి  కొంత ధనమును ఇప్పించి పంపారు.

 

1027total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *