Turaga Ramakavi Peddapuram History

తురగా రామకవి – పెద్దాపురం సంస్థానం

అవి శ్రీ శ్రీ శ్రీ వత్సవాయ విద్వత్ తిమ్మజగపతి మహారాజు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులు ఆకాలంలో పెద్దాపురం సంస్థాన పరిశిష్టమైన తుని లో తురగా రామకవి అనే ఒక తిట్టుకవి ఉండేవారు. వేములవాడ భీమకవి తరువాత తిట్టు కవిత్వంలో ఇతనితో సమానమైన కవి వేరే ఎవరూ లేరు. భీమకవివలెనే తురగా రామ కవి మాట్లాడిన ప్రతీ మాట నిజం అవుతుంది అనే నానుడి దేశమంతా ఉండటం వల్ల అన్ని రాజ్యాల రాజులు తురగా రామకవి అనగానే భయభక్తులు కలిగి ఉండేవారు

తురగా రామకవి దేశాటనం చేస్తూ సంవత్సరానికోసారి రాజుల్ని దర్శిస్తూ బహుమానాలందుకునేవారు. ఆయనకీ చాలా ఆస్తానాలలో వార్షాకాసనాలు ఉండేవి వార్షికాసనం అంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ సంస్థానానికి వెళ్లి ఐదు పది రోజులు ఆయా మహారాజుల ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన కానుకలు స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట, అలానే ఓసారి పెద్దాపురం ప్రభువైన వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి మహారాజుని దర్శించి అతని ఆతిధ్యం స్వీకరించి వెళ్లి, మళ్ళీ సంవత్సరం కాకుండానే రెండోసారి వచ్చేసరికి రాజు బహుమానమే కాక, దర్శనం కూడా ఇవ్వలేదు. రామకవి కోపగించి కోటగోడ మీద బొగ్గుతో ‘పెద్దమ్మ నాట్యమాడును-దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్ ‘ అని వ్రాశారట, పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మ లక్ష్మీదేవి అదృష్ట దేవతైతే, ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట. ఈ విషయం తెలుసుకున్న తిమ్మ జగపతి రాజుపరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళమీద పడి అయ్యా మీరు మొన్ననే కదా వచ్చారు తమరి దర్శన భాగ్యం ఇంత త్వరగా మళ్ళీ వస్తుందని ఊహించలేదు మిమ్మల్ని మళ్ళీ సేవించుకునే అవకాశం మాకు కలుగజేసినాడుకు ధన్యుడనని చెప్పి శాంతింప జేసే సరికి… కవి గారు ఆయన వ్రాసిన వాక్యం ముందు

అద్దిర శ్రీ భూనీలలు
ముద్దియ లా హరికి గలరు ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడును
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మన ఇంటన్

అని రాసి శాప వాక్యం కాస్తా దీవెన గా సవరించారట దీనిని బట్టి తురగా రామకవి గారు ఎంతటి వాక్చాతుర్యం పాండిత్య ప్రజ్ఞ ఉన్నవారో ఇట్టే తెలిసిపోతుంది. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది

అయితే రాజుగారి శాపం సవరించినప్పటికీ ముందు మనస్ఫూర్తిగా శాప వాక్యం రాసిన కారణం చేత తిమ్మజగపతి మనుమని కాలంలో పెద్దాపురం సంస్థానం తీవ్ర పతనమై అప్పుల పాలై సంస్థానంలోని గ్రామాలు వేలం పాటకు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది అని కధనం

తురగా రామ కవి ఒకరోజు లేటవరపు పోతు రాజు అనే క్షత్రియుని యింటికి వెళ్లెను ఆ రాజు ఈ కవి కి ఇప్పుడు ఏమైనా ఇవ్వవలసివస్తుందేమో అని తన పరివారం చేత రాజు గారు లేరని చెప్పించారట! విషయం తెలుసుకున్న రామకవి

కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నవేయునప్పటికి పోతురాజు మృతుడయ్యెనట! వెంటనే భార్యవచ్చి కవి కాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా కరుణించి

క. మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే పోతురాజు తిరిగి జీవించి పైకి లేచెనట

ఒకప్పుడు రామకవి స్వయంగా ఇల్లు కట్టుకుంటూ గోడమీద కూర్చుని, దారిన పోయే వాళ్ళందరినీ నేలమీద ఉన్న ఇటుకులను ఒక్కొక్కటి చొప్పున అందించి వెళ్ళమని ఆజ్ఞాపించడం మొదలు పెట్టాడు. ఆయన నోటికి డడిచి వాళ్ళంతా ఆయన చెప్పినట్టే చేసి, వెడుతున్నారు. ఇంతలో ఆ దారిన ముక్కోపి ఐయిన అడిదం సూరకవి వెళ్ళడం రామకవి ఆయనను కూడా ఒక ఇటుక అందివ్వమన్నాడు. అతను రామకవి అని తెలియని సూరకవి కళ్ళెర్ర చేసి “సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు”
అని పలికి వెళ్ళిపోబోయేనట | వెంటనే తురగా రామకవి ఆ మాటవిని తనకళ్లను మరింత పెద్దవిగా ఎర్రగా చేసుకుని, “రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ” అని కేకవేసెనట. వెంటనే సూరకవి ఆతడు రామకవి అని తెలిసికొని కొన్ని ఇటుకలు అందించి రామకవి కి నమస్కరించి వెళ్లిపోయేనట @వంగలపూడి శివకృష్ణ

 

1602total visits,5visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *