Vadapalli Venkateswara Swamy History

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర, ఆత్రేయ పురం

పెద్దాపురం సంస్థానాదీసుల నిర్మాణం : ఆత్రేయ పురం అగ్రహారం

ఆత్రేయపురం పేరు వింటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ పూతరేకులు గుర్తొస్తాయి అయితే ఆత్రేయ పురం గ్రామం ఎలా ఏర్పడిందో మాత్రం చాలామందికి తెలియదు, ఆత్రేయపురం పూర్వచరిత్ర ఒకసారి పరిశీలిస్తే

గోదావరి నది – కొండలు, కోనల మీదుగా ప్రవహిస్తూ, పరవళ్లు తొక్కుతూ, ఎందరెందరో వీరుల విజయ గాధలకూ, కవి వరేణ్యుల మధుర భావనలకూ, గాయకుల గంధర్వ గానాలకూ, శిల్పిశ్రేష్టుల అపూర్వ సృష్టికి, శాస్త్రజ్ఞుల విజ్ఞాన వైభవానికి ఆలవాలంగా అలరారుతోంది.

అలాంటి పవిత్ర గోదావరి ఒడ్డున వేదకోవిదులైన విప్రవంశాల వారు నివసిస్తూ, వేద విద్యకు అభ్యసిస్తూ అందరికీ భోదిస్తూ, వారి పూజాదికార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించుకుంటూ శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారు,

విదేశీ దండయాత్రలూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా వీరు తమ ప్రశాంత నివాసాలను వీడి వలస పోవలసి వస్తున్నా, వారు గోదావరి మాత ఒడిని మాత్రం వీడలేదు. ఆ నదీమతల్లి ననుసరించి పయనిస్తూ, గోదావరీ సాగర సంగమ ప్రాంతాన్ని చేరుకొన్నారు. అలా గౌతమీ తీరాన నివసిస్తూ, వేదమాతను ఉపాసిస్తూన్న విప్రులలో జటావల్లభుల వారు, కాశీచయనుల వారు కొందరు వారు సంప్రదాయ బద్ధంగా సంవత్సరాల పాటు నియమనిష్ఠలతో అభ్యసించిన వేద విద్యను శిష్యులకు ఆదరంగా నేర్పారు వారు.

ఆ వేద ప్రతి పాదితాలైన యజ్ఞ యాగాది కర్మలను తాము ఆచరిస్తూ, తోటి వారిని ఆచరింప చేయడానికి వారు కృషి చేసారు. ఋత్విక్కు అధ్వర్యుడు, ఉద్గాత, ఉపద్రష్ట, అను నలుగురు యజ్ఞ విధులను నిర్వర్తించేవారు. యజ్ఞం చేసి సోమయాజి కావడం నాటి విప్రుల జీవిత పరమావధి.

వీరిలో జటావల్లభుల వారు మొదట్లో తెలంగాణాలోని వెదురుచర్ల అనే గ్రామంలో నివసిస్తూ ఆ గ్రామ నామమే ఇంటిపేరుగా ధరిస్తూ వుండేవారు. వేదమాతకు వారు కూరిమి బిడ్డలు, జటా, ఘన అనేవి వేదంలో క్లిష్టమైన అంశాలు వాటిని నిర్దుష్టంగా పఠించి పండిత పరిషత్తులో జటావల్లభ అనే బిరుదు నామాన్ని పొందారు ఆ వంశంలోని ఓ ధన్యజీవి. నాడు దేశాన్ని పాలిస్తున్నది తురుష్కులైనా, వారిలో కొందరు వేదవిద్య పట్ల గౌరవాభిమానాలు కలిగి వుండేవారు. అటువంటి నవాబు ఒకరు వీరికి ఈనాములు ఇచ్చి గౌరవించారు.

కాలక్రమాన వచ్చిన యుద్ధాల వలన ప్రజా జీవితం కలత చెంది అనుష్టానాలకు భంగం వాటిల్లుతూ వుండటం వలన వారు ఆ ఊరు విడిచి పెట్టవలసి వచ్చింది. ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు కదా ! ఉన్న ఊరు విడిచినా గోదావరి తీరవాసాన్ని మాత్రం వీడలేని వారు ఆ నది వెంబడే సుదీర్ఘ పయనాలు సాగిస్తూ వచ్చి పెద్దాపురం సంస్థానం చేరారు.

ఆ రోజుల్లో పెద్దాపురం సంస్థానం మంచి ఆదాయం కలిగివుండి ధర్మపరుడు, శాంతి భద్రతలు పరిరక్షించగల సమర్థుడు అయిన ప్రభువు పాలన ఉండేది. ఈ వేద పండితుల్ని సగౌరవంగా ఆదరించి, కొన్ని ఈనాములు ఇచ్చి తమ కొలువులో నెలకొల్పుకొన్నారు ఆ ప్రభువులు. ఒక పర్యాయం పెద్దాపురం ప్రభువులకు స్వప్నంలో సాక్షాత్కరించి తాను గౌతమీ తీరాన వెలుస్తున్నానని తనకు గుడి గోపురాలు నిర్మించి, పూజా పురస్కారాలకు ఏర్పాట్లు చేయమని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశించాడు. గోదావరి డెల్టాలో వాడపల్లి అనే గ్రామం వద్ద గోదావరిలో బెస్తవారికి వేంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. దాన్ని వారు ఒక పాకలో వుంచి వారికి తోచిన విధంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. రాజ పురుషులు అక్కడికి వచ్చి స్వయంగా చూసి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదించారు. మహారాజు అశ్వారూఢుడై బయలుదేరి వచ్చాడు. ఆలయ నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేసారు. ఆలయంతో పాటు స్వామి సేవకు అర్చకులూ, మహా ప్రసాదం తయారు చేయడానికి వంటవారు, స్వామి సేవకులు, వాద్యకారులైన మంగలులు, నృత్య గీతాదికైంకర్యానికి దేవదాసీలు వచ్చి చేరారు. ఆలయ ధర్మకర్తలుగా తమ సంస్థానంలో వున్న వేద పండితులైన జటావల్లభుల వారి వంశంలో ఒక శాఖను వాడపల్లి పంపారు పెద్దాపురం సంస్థానాధీశులు. వీరితో పాటు మరికొన్ని బ్రహ్మణ వంశాల వారు గౌతమీ తీర వాసాన్ని కోరి వచ్చారు. వారందరికీ ప్రభువు వాడపల్లి గ్రామానికి 2 మైళ్ళ దూరంలో నివేశన స్థలాలు, జీవికకై పంట పొలాలు ఇచ్చి ఆత్రేయపురం అగ్రహారాన్ని ఏర్పరచారు. అష్టాదశ వర్ణాల వారు వచ్చి అగ్రహారానికి అనతి దూరంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఆత్రేయపురం గ్రామం ఆ విధంగా ఏర్పడింది .

మొదట్లో అగ్రహారం గోదావరి గట్టు క్రింద ఉండేది. వారి స్నానాద్యనుష్ఠానాలకు నదీ మాత సమీపాన వుండుట అనుకూలమని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు వారు. ఒక పర్యాయం వచ్చిన గోదావరి వరదల్లో అగ్రహారం కొట్టుకొని పోయింది. అగ్రహార వాసులంతా మెరక ప్రాంతానికి తరలివచ్చారు. వారి స్థితి చూసి గ్రామంలో కొందరు ధనికులు గోదావరికి కొద్ది దూరంగా కొంత మెరక ప్రాంతంలో వారికి నివేశన స్థలాలు బహుకరించారు. వారు అక్కడ గృహాలు నిర్మించుకొని సుఖంగా జీవించసాగారు. పాత అగ్రహారంలోని విశాలమైన నివేశన స్థలాలు పంట పొలాలుగా మారి వారికి కొంత ఆదాయాన్ని సమకూర్చసాగాయి. గోదావరీ తీరానికి తరలివచ్చిన విప్రవంశాలలో కాశీచయనులవారు, శిష్టావారు, భమిడిపల్లివారు, తణుకువారు, పొదిలి వారు కొందరు. గ్రామ రెవెన్యూ పనులను నిర్వహించడానికి కొన్ని నియోగి బ్రాహ్మణ కుటుంబాలను తెచ్చి గ్రామ కరణాలుగా ఉద్యోగాలిచ్చి వారికి వసతులు కల్పించారు ప్రభువులు. వారికి ఆ గ్రామ నామమే ఇంటి పేరుగా ఏర్పడిరది. అక్కడి సుఖజీవనాన్ని కోరి మరికొందరు నియోగి బ్రాహ్మణ వంశాల వారు కూడా ఆ గ్రామానికి తరలివచ్చారు. జటావల్లభుల వారు అంగీరస, ఆయాస్య, గౌతమ సగోత్రీకులు ఆంగీరసుడు బృహస్పతి దేవగురువు. త్రైలోక్యాధిపతికి గురుస్థానంలో నిలిచిన మతివిభవం అతడిది. గౌతముడి సంతతియైన వారు గౌతమీ తీర వాసాన్నే సదా కోరుతూ కొన్ని వందల మైళ్ళు ప్రయాణిస్తూ వచ్చి ఇచ్చట స్థిరపడినారు.

862total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *