Vadlaginjalu Story, Peddapuram History

వడ్లగింజలు

పెద్దాపురం చతుర్భుజ తిమ్మ జగపతి v/s తంగిరాల శంకరప్ప

 

”శ్రీశ్రీశ్రీ చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులు, మహరాజుకి కళలంటే మక్కువ ఎక్కువ, అందునా చదరంగం అంటే ఆరో ప్రాణం. ఆడేవారు లేక, ఆడగల సత్తా ఉన్నవారు దొరకక, ప్రతివారు ఆటకి సిద్ధమైతే విసిగి, తనతో ఆడి,ఓడినవారికి శిరఛ్ఛేదం ప్రకటించేరు, మహరాజు. దానితో చదరంగం ఆడగలిగిన సత్తా ఉన్నవాడు దొరకక మహరాజు విచారంలో ఉన్న కాలం.

నిర్భాగ్యుడు, పండితుడు, బ్రాహ్మణుడు, కాని చదరంగం లో అందెవేసిన చేయి అయిన ”తంగిరాల శంకరప్ప” రాజ దర్శనం కోసం దివాన్జీని అర్ధిస్తున్న సమయం, మహరాజు దర్శనానికి, చదరంగపు ఆట ఆడటానికి, తన విద్య ప్రదర్శించడానికి శంకరప్ప శతవిధాల ప్రయత్నం చేస్తుంటే, సహస్ర విధాల దివాన్జీ అడ్డుకుని, అర్ధ చంద్రప్రయోగంతో బయటకు పంపిన రోజు.

మొహం వేలాడేసుకుని పూటకూళ్ళ ఇల్లు చేరాడు, శంకరప్ప. ‘ఏమయింద’ని వాకబు చేసింది పెద్దమ్మ. జరిగింది వివరించాడు, ”ఆటలో అంత ప్రజ్ఞ ఉన్నవాడివి, లౌక్యం తెలియకపోయిందోయ్ నాయనా” అని విచారించింది. ”జరిగిందేదో జరిగింది, ఇక ముందు మహరాజు నీదర్శనం కోసం వేచి చూడాలి, నిన్ను అర్ధ చంద్రప్రయోగంతో బయటకు పంపిన దివాన్జీ పిసుక్కోవాలి, నీ ఎదుట చేతులు కట్టుకు నిలబడాలి, దానికున్నది ఒకటే మార్గ”మంది. ”చెప్పమ”న్నాడు శంకరప్ప. ”పెద్దాపురం పట్టణం లో అందరూ చదరంగం ఆడుతూనే ఉంటారు, చిన్నా పెద్దా కూడానూ. ఆటకి అడ్డపడు, నీ ప్రతిభ రాజుని చేరాలి, రాజు నీ దర్శనం కోసం తహతహలాడాలి,”తిరుమంత్రం ఉపదేశించింది పెద్దమ్మ, అంతే! బయలుదేరాడు, భోజనం చేసి వెళ్ళమన్నా వినక. దగ్గరలోనే ఇద్దరు యువకులు ఆడుతున్న చదరంగపు బల్ల దగ్గరకి చేరి మాట కలిపి ఒకరికి సాయం చేసి తను పైనే ఉండి ఒకటి రెండు ఎత్తులలో అవతలి వారి ఆట కట్టిస్తాడు. ఇది చూసిన వారిద్దరూ అతనికి ముఖ్య అనుచరులైపోతారు.

వారు  మరునాడు ఉదయమే మరొకచోటికి తీసుకుపోయి, లోసానులో ఆట ఉన్నవారికి మాట సాయం చేసి, అక్కడకూడా దూరానుంచే ఎత్తులు చెప్పి, ఓడిపోయే ఆటని నెగ్గిస్తాడు. ఇలా కనపడిన ప్రతివారిని చదరంగంలో జయిస్తూ పోతున్నాడు. పెద్దాపురం లోని సాని ఒకతె, రాజబంధువైన సరసునితో చదరంగం ఆడుతోంది, గోడ బయట నుంచి ఏ గడిలో ఏ పావు ఉన్నదీ సాని వివరిస్తే, గోడ ఇవతలినుంచే, రెండెత్తులు చెప్పి ఆమె ఆట నెగ్గిస్తాడు, ఈమె మహరాజు దగ్గర నిత్యం ఉండే పరిచారిక.  మహరాజు అంతేవాసి, రాజబంధువు,ఒకరితో ఒక రోజు చదరంగం ఆడుతుండగా దివాన్జీ నుంచి ”వచ్చి దర్శనం చేసుకోమని” కబురొచ్చింది. కోపం ఆపుకున్న శంకరప్ప ”రానని” కబురు చేస్తాడు, ఇది మహరాజు కబురే అని అందరు అనుకుంటుండగా. ”రానని చెప్పేరేమ”ని అక్కడివారడిగితే వివరాలు తరవాత చెబుతానంటాడు. పెద్దాపురపు పట్టణానికి ఇదొక సంచలనమై పోయింది.మహరాజుకు వార్తలు అందుతున్నాయి, ఒకచోటనుంచే కాదు, పలు చోట్లనుంచి, రాజు మనసు గుబగుబలాడిపోయింది, అతనితో ఆట వెయ్యాలని. మరునాడు, సేనాపతి గుర్రాన్ని తీసుకొచ్చి మహరాజు ”దర్శనం ఇప్పించమన్నారని మనవి” చేశాడు. ”దర్శనం చేసుకోమనడానికి,” ”దర్శనం ఇప్పించమనడానికి” తేడా గమనించి ఉంటారు పాఠకులు. మహరాజు “దర్శనం ఇప్పించమని మనవి చేశాడు,” దివాన్జీ “దర్శనం చేసుకోమని” కబురు చేశాడు అదీ తేడా.

గోచీపాతరాయుడని, దివాన్జీచే ఈసడింపబడిన శ్రీమాన్ తంగిరాల శంకరప్పగారు కొల్లాయి గుడ్డతో, పైన మరొక కొల్లాయితో దర్శనానికి బయలుదేరాడు, మహరాజు పంపిన గుర్రం మీద. దివాన్జీ చేతులు కట్టుకు నిలబడి, చేతులు పిసుక్కుంటూ, దారి చూపించాడు. మహరాజు సాదర ఆహ్వానమిచ్చారు, ఎదురొచ్చి. చదరంగపు బల్ల దగ్గర చేరారు ఆట మొదలయింది, కొంత సాగింది, అంతసేపు మహరాజుతో ఆడినవారే లేరు, శంకరప్ప ఒక శకటుని ఒక ఇంటిలో నొక్కి వేస్తూ మహరాజు కేసి చూశాడు, ”ఇక మీరు ఎత్తు వేయలేరు”, ”మీ ఆటకట్టిందన్న” సూచనగా. అది మొదలు రోజూ ఉదయం సాయంత్రం చదరంగపు బల్ల దగ్గరకు మహరాజు, శంకరప్ప చేరడం, రాజు ఎత్తు వేయలేకపోవడం, మరునాడనుకుని కదలడం మామూలైపోయింది. మహరాజు ఎత్తు వేయాలి కాని వేయలేడు, వేస్తే ఆట కట్టేస్తుంది. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలూఅయ్యాయి, అవీ ఏడయ్యాయి. ఇక మహరాజు కి మార్గం దొరికేలా లేదు. ఒకరోజు గుర్రం పంపించి ”గుర్రం మీద రమ్మని” కబురు పంపారు, శంకరప్పకి, అది గమనించిన శంకరప్ప, ”ఏనుగు మీద కాని వెళ్ళరట” అని కబురు పంపారు. కబురు తెచ్చిన వ్యక్తికి అటు రాజు చెప్పినది కాని ఇటు శంకరప్ప చెప్పినది కాని అర్ధం కాలేదు. నిజానికి పాఠకునికీ అర్ధం కాదు. అది ఆటలోని ఒక చిత్రం. రాజు ఆటలో గుర్రాన్ని కదుపుతానని కబురు చేశారనమాట, దానికి శంకరప్ప ఏనుగుతో అడ్డుకుంటానని, దానితో ఆట కడుతుందనీ, ప్రతి సమాధానమిచ్చాడు. మహరాజుకి మార్గం లేక సభ చేసి ఓటమి ఒప్పుకుని ”పెద్దాపుర రాజ్యం లోనిదేదైనా సరే కోరుకోమ”న్నారు.

తాను బ్రాహ్మణుడినని, సామాన్యుడిననీ అందుచేత గ్రాసానికి తగిన వసతి ఏర్పాటు చేయమని కోరతాడు. అదెలాగంటే చదరంగపు బల్ల పై, ఒక వడ్లగింజ ఒక గడిలో పెడితే రెండవాదినిలో రెట్టింపు మూడవదానిలో రెండవాదాని రెట్టింపు పెడుతూ వెళితే అరవై నాలుగు గడులలో లెక్కవచ్చే వడ్లగింజలు మొత్తం ఇప్పించమని కోరేడు. మర్నాడు కలుద్దామని విడిపోయారు. లెక్కలు కట్టడం ప్రారంభించారు. మర్నాడు సభ జరిగింది,దివాన్జీ లెక్కతేల్చాడు, పెద్దాపురం సంస్థానం మొత్తం మీద ముఫై సంవత్సరాల కాలంలో పండే ధాన్యపు విలువ అది. ఈ లెక్క మహరాజుకీ ఆశ్చర్యమయింది. ”పెద్దాపురం సంస్థానాన్నే ఇచ్చేస్తున్నా” తీసుకోమన్నారు, మహరాజు. మహరాజా తమరు ”పెద్దాపురం సంస్థానం లో ఉన్నది ఇస్తామన్నారు కాని సంస్థానం కాదు,” అని ధర్మ సందేహం వెలిబుచ్చాడు. అదీగాక బ్రాహ్మణుడికి కుటుంబ సహితంగా జీవించడానికి కావల్సినది దయచేయమన్నాడు. మహరాజు సర్వం సహా అగ్రహారాన్ని దయచేశారు.”

ఈ కథ 1941 ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది.

1086total visits,1visits today

Add a Comment

Your email address will not be published. Required fields are marked *